అందరికీ అమ్మ.. జయమ్మ

25 Jan, 2020 11:37 IST|Sakshi
భర్త వైఎస్‌ రాజారెడ్డితో వైఎస్‌ జయమ్మ(ఫైల్‌)

పులివెందుల సర్పంచ్‌గా సేవలు..

సామాజిక సేవకు ఆమె పెట్టింది పేరు

కరువు కాలంలో పట్టెడన్నం పెట్టిన మాతృమూర్తి  

నేడు వైఎస్‌ జయమ్మ14వ వర్ధంతి

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ అడగకుండానే అందరికి అన్నీ పెట్టిన అమ్మ వైఎస్‌ జయమ్మ. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి ఆమె.  పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ దాతృత్వం ప్రదర్శించేవారు. తన బిడ్డ రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి 25వ తేదీన జయమ్మ కన్నుమూశారు. 2003లో వైఎస్‌ఆర్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా తల్లడిల్లిపోతూనే బిడ్డకు మంచి జరగాలని కోరుకునేవారు.1999లో కరువు కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పది మందికీ పట్టెడు అన్నం పెట్టి జన్మ సార్థకత చేసుకున్నారు.

అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి మన్ననలందుకున్నారు. 1995నుంచి 2000వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్‌ అవార్డు పొందారు. పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా .. పులివెందుల అమ్మగా జయమ్మ గుర్తింపు పొందారు. 

నేడు వైఎస్‌ జయమ్మ వర్ధంతి   
దివంగత వైఎస్‌ రాజారెడ్డి సతీమణి వైఎస్‌ జయమ్మ 14వ వర్ధంతి శుక్రవారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు పాలు పంచుకోనున్నారు. వైఎస్‌ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలు చేయనున్నారు. జయమ్మ పార్క్‌లో ఆమె విగ్రహం వద్ద  వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్‌ఆర్‌ అభిమానులు కూడా పాల్గొంటారు.

మరిన్ని వార్తలు