విజయవాడలో వైఎస్సార్‌ భారీ విగ్రహావిష్కరణ

4 Sep, 2019 03:57 IST|Sakshi
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో పార్టీ నేతలు

ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా..వర్షపు జల్లులు.. ఆనందోత్సాహాల మధ్య ఆవిష్కరణ

2011లో ఇదే విగ్రహాన్ని ఏర్పాటుచేసిన అప్పటి సర్కార్‌

2016లో అర్ధరాత్రి తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం 

దివంగత సీఎం వైఎస్సార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళి

సాక్షి, అమరావతి/కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌ విగ్రహాన్ని సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలోని కంట్రోల్‌ రూం ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ పార్కులో ఈ విగ్రహాన్ని ప్రజల హర్షధ్వానాలు, వర్షపు జల్లుల మధ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సీఎం ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30 నుంచి రెండుసార్లు జడివాన కురిసినా సరిగ్గా జగన్‌ వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించే సమయానికి వర్షం తెరిపిచ్చింది. కాగా, 2011లో ఇక్కడే అన్ని అనుమతులతో వైఎస్సార్‌ భారీ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తరువాత చంద్రబాబు సర్కార్‌ 2016 జూలై 31వ తేదీ అర్థరాత్రి వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించింది.

ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం మున్సిపల్‌ శాఖ ద్వారా అన్ని అనుమతులు తీసుకుని వైఎస్‌ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, జేసీ మాధవీలత, నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యేలు పార్థసారథి, విష్ణు, రక్షణనిధి, మేకా ప్రతాప్‌ అప్పారావు, జోగి రమేష్,  కృష్ణప్రసాద్, ఎం.జగన్‌మోహన్‌రావు, సింహాద్రి రమేష్, అనిల్‌కుమార్, డి. నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఇతర నేతలు పొట్లూరి వరప్రసాద్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇడుపులపాయలో జగన్‌ ఘన నివాళి
అంతకుముందు.. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో వైఎస్‌ జగన్‌.. ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. వైఎస్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడకు తరలివచ్చారు. ఆయనతోపాటు తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ షర్మిలమ్మ, సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ, కుమార్తె వైఎస్‌ షర్మిలమ్మ భావోద్వేగానికి గురై కంటితడి పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ ఇతర కుటుంబ సభ్యులు విమలమ్మ, కమలమ్మ, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, ఈసీ గంగిరెడ్డి, సుగుణమ్మ, వైఎస్‌ ప్రమీలమ్మ, డిప్యూటీ సీఎంలు అంజద్‌బాషా, పిల్లి సుభాష్‌చంద్రబోస్, చీఫ్‌విప్‌ గడికోట, మంత్రి బుగ్గన, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, వెంకట సుబ్బయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పులివెందులలో వైఎస్‌ వివేకా విగ్రహావిష్కరణ
అనంతరం వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుని మాజీమంత్రి, చిన్నాన్న దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితోపాటు పలువురు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు.. వైఎస్‌ జగన్‌ వైఎస్‌ వివేకా ఇంటికి వెళ్లి ఆయన సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.  

వాడవాడలా..
కాగా, వైఎస్‌ వర్థంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మహానేతను స్మరించుకుంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని వైఎస్‌ సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన చూపిన ప్రగతిబాటను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అలాగే, విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ వైఎస్‌ వర్థంతి కార్యక్రమం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగింది. 

వైఎస్సార్‌కి గవర్నర్‌ నివాళి
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా వైఎస్‌కు నివాళి ప్రకటించారు. తెలుగు ప్రజలు వైఎస్సార్‌ జ్ఞాపకాలను ఎప్పటికి మరచిపోలేరని ఆయన  కొనియాడారు. వైఎస్‌ అందించిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ప్రజలు వైఎస్సార్‌ను నిత్యం తలుచుకుంటూనే ఉంటారని గవర్నర్‌ తెలిపారు.

మమతా బెనర్జీ కూడా..
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వైఎస్‌కు నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఒక ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు