వాటర్‌ గ్రిడ్‌కు ఆద్యులు మహానేత వైఎస్సార్‌

8 Jul, 2020 12:13 IST|Sakshi

‘పశ్చిమ’పై వల్లమాలిన అభిమానం 

జిల్లాకు పోల‘వరం’ ఇచ్చిన ప్రదాత 

మెట్ట సస్యశ్యామలంపై ప్రత్యేక దృష్టి 

ఉద్యాన వర్సిటీతో విద్యాదానం 

ఏలూరుకు వరదల నుంచి విముక్తి 

నేడు వైఎస్సార్‌ జయంతి  

‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. రైతు శ్రేయస్సు లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ ఇచ్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం పోటీపడి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.. అడుగడుగునా ఆయన గురుతులతో మదిమదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. బుధవారం ఆయన జయంతి సందర్భంగా మహానేత.. అందుకో మా జ్యోత అంటూ జిల్లావాసులు నివాళులర్పిస్తున్నారు.

సాక్షి, ఏలూరు: జిల్లా అభివృద్ధి, గోదావరి వాసుల సంక్షేమం లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషిచేశారు. ఆయన హయాంలో నిత్య సమీ క్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులను అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రూపకల్పన చేసిన పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు జిల్లా గతిని మారుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలుమార్లు జిల్లాకు వచ్చిన ఆయన అడగకుండానే వరాలు ఇచ్చారు. జిల్లా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.  

జీవనాడి పోలవరం: 2004లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10,151 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేశారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య హెడ్‌వర్క్స్‌ పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల తవ్వకాలను వేగంగా పూర్తిచేశారు. ఆయన హయాంలో 70 శాతం వరకు కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరంలో రూ.3.75 కోట్లతో నెక్లెస్‌ బండ్,  ముంపు జలాలను గోదావరిలోకి మళ్లించడానికి రూ.58 కోట్లతో కొవ్వాడ అవుట్‌ ఫాల్‌స్లూయిజ్‌  నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.2,700 కోట్లతో ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకాన్ని కూడా వైఎస్‌ ప్రారంభించారు. తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాల్లోని 22,348 ఎకరాలకు సాగునీరు అందుతుంది.  

ప్రాణధార ‘చింతలపూడి’ 
మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి అందిచేందుకు రూ.1,701 కోట్ల అంచనాలతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. 2008 అక్టోబర్‌ 30న పథకానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.   

పోగొండతో జలకళ 
బుట్టాయగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్‌ను 2008లో రూ.28 కోట్ల అంచనాలతో వైఎస్సార్‌ మంజూరు చేశారు. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పథకం మంజూరు చేశారు. దీనిద్వారా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో దాదాపు 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.   

‘ఉద్యాన’ వెలుగులు 
తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడం ద్వారా యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు కలి్పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు.  

ఆరోగ్య ప్రదాత 
మెట్ట ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. డెల్టాకు వరాల జల్లు నరసాపురంలో రూ.10 కోట్లతో సుమారు 600 మందికి ఇళ్లు నిర్మించారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరుచేసినా తర్వాత పాలకులు దీనిపై దృష్టి సారించలేదు. అంతర్జాతీయంగా రాణించేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్‌మెంట్‌ నిర్మించడానికి  ఆయన తీసుకున్న చొరవతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు.  

ఏలూరుకు వరదల నుంచి విముక్తి 
ఏలూరులో సుమారు రూ.90 కోట్లతో తమ్మిలేరు ఏటిగట్టును పటిష్ట పర్చడం ద్వారా న గరవాసులకు వరదల నుంచి విముక్తి కలి్పంచారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. 

వాటర్‌ గ్రిడ్‌కు ఆద్యులు
పెనుగొండ: జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్‌ గ్రిడ్‌కు ఆద్యులు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 2008లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా డెల్టాలో తాగునీటి సమస్య నివారణకు వాటర్‌ గ్రిడ్‌ ప్రతిపాదనలు చేశారు.ఆయన సూచనల మేరకు అప్పటి అత్తిలి ఎమ్మెల్యేగా నేను కసరత్తు చేశాను. దాదాపు రూ.300 కోట్ల అంచనాలు సైతం రూపొందించాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం పథకం అటకెక్కింది.

ఇప్పుడు తండ్రి ఆశయాన్ని సీఎం జగన్‌ పట్టాలెక్కిస్తున్నారు. జిల్లాలో మరో 50 ఏళ్ల పాటు తాగునీటి సమస్య లేకుండా వాటర్‌గ్రిడ్‌ను కానుకగా అందించనున్నారు. నాటి కలను నేడు సాకారం చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో ఎందరికో ఇళ్ల స్థలాలు అందించారు. అదే స్ఫూర్తితో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్‌ ఆశయాల మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నాం. 
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  

మరిన్ని వార్తలు