పర్యాటక కేంద్రంగా ఇడుపులపాయ

12 Jul, 2019 08:40 IST|Sakshi
అధికారులతో చర్చిస్తున్న ఎండీ చంద్రమోహన్‌రెడ్డి

ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి 

ప్రొద్దుటూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ ఉన్న ఇడుపులపాయ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ నరాల చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన తన సిబ్బందితో కలిసి గురువారం ఇడుపులపాయ ప్రాంత పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో తాము శ్రీశైలం సమీపంలోని నల్లకాలువ వద్ద వైఎస్సార్‌ స్మృతివనాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. వైఎస్సార్‌ స్మృతివనానికి గూగుల్‌ రేటింగ్‌ 4.3గా ఉందన్నారు. గత వారంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఇడుపులపాయ అభివృద్ధి గురించి చర్చించామన్నారు. కేవలం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనా.. నిధులు లేని కారణంగా ఆగిపోయాయని తెలిపారు. ఇడుపులపాయ అభివృద్ధిలో భాగంగా రెస్టారెంట్, ఆట వస్తువులు, జిమ్, ఆడియో విజువల్‌ థియేటర్‌ను నిర్మించాలనే యోచనలో ఉన్నామన్నారు. పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమీపంలో ఉన్న గండి క్షేత్రం, పాపాగ్ని నది, నెమళ్ల ప్రాజెక్టు, చుట్టూ ఉన్న కొండలు ఇడుపులపాయకు అదనపు ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మళ్లీ ఇడుపులపాయను సందర్శించిన తర్వాత నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నిధులు మంజూరైన తర్వాత ప్రాజెక్టు పనులు చేపడుతామన్నారు. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే విషయంపై ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పారు. ఎండీ వెంట ప్రిన్సిపల్‌ ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కెటెక్‌ బలరామిరెడ్డి, జనరల్‌ మేనేజర్లు శివరాం, బాలసుబ్రహ్మణ్యం, టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఈఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు