..అందుకే గుండెల్లో గుడి! 

2 Sep, 2019 02:47 IST|Sakshi

ప్రజలకు మేలు చేయడంలో వైఎస్‌ డైనమిక్‌ నిర్ణయాలు 

నిబంధనలు కాదని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన 

దూరదృష్టితో అభివృద్ధికి ప్రణాళికలు 

అన్ని వర్గాల ప్రజల అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన  

నమ్ముకున్నవారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు 

అన్ని రంగాలనూ కొత్త పుంతలు తొక్కించిన వైనం 

చరిత్రాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది గుండెల్లో పదిలం

ఒకసారి వైఎస్‌ను కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు భావిస్తాడు. అది వైఎస్‌ వ్యక్తిత్వంలోని విశిష్టత. పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడే మనస్తత్వం, చిరునవ్వు, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, నమ్ముకున్నవారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, కుల మతాలకు అతీతంగా వ్యవహరించే లౌకిక స్వభావం, నేలవిడిచి సాము చేయని ఆచరణవాదం, ప్రేమ, ఆప్యాయతను పంచిపెట్టే ధోరణి వైఎస్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టాయనడం అక్షర సత్యం.     
– సాక్షి, అమరావతి

నిజమైన ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణం ‘మీకు అండగా నేనున్నాను’ అన్న భరోసా ప్రజలకివ్వడం. సహచరులు, అనుచరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేనికీ వెనకాడకుండా ఆదుకోవడం. వాగ్దానాలను అమలు చేయడానికి మనస్ఫూర్తిగా, నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేయడం. ప్రజల ప్రగతి పట్ల, వారి అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం. ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడటం. సంక్షేమ, ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని సాధించడంలో క్షేత్రవాస్తవికతను దృష్టిలో పెట్టుకొని, సాహసోపేతమైన, సృజనాత్మకమైన కార్యక్రమాలు రూపొందించుకొని భవిష్యత్‌ చిత్రపటాన్ని నిర్ణయించుకోవడం. దూరదృష్టితో అభివృద్ధికి ప్రణాళికా రచన చేసిన రాజకీయవాదే రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిపోతారు. ఇలా నిలిచిపోయిన వారిలో దివంగత వైఎస్సార్‌ అగ్రగణ్యుడు.

పేదలందరినీ దృష్టిలో పెట్టుకుని ‘ఆరోగ్యశ్రీ’, ఫీజురీయింబర్స్‌మెంట్, పేదలకూ, దళితులకూ భూ పంపిణి వంటి కార్యక్రమాలను పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ది. ఎవరికి ఏ సంక్షేమ పథకం వర్తింపజేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మార్గపు వ్యవస్థ ఆ మహానేత హయాంలో లేదు. అన్ని సంక్షేమ పథకాల అమలులో ‘శాచ్యురేషన్‌’ (అవసరం ఉన్న అందరికీ నూటికి నూరు శాతం అనుభవంలోకి రావాలి) అనేది వైఎస్‌ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఓ విప్లవాత్మక నిర్ణయం. దేశంలోనే చర్చనీయాంశమైంది. ఈ దేశానికి వ్యవసాయం వెన్నెముక అనే విషయంపై అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధానమని గుర్తించి జలయజ్ఞం ఆరంభించారు. నేడు ఇది ఫలాలనిస్తోందంటే ఇందుకు కారణం ముమ్మాటికే వైఎస్సే.  

కష్టం విలువ తెలిసిన ప్రజా నేత: ఆపదలో ఉన్న వారిని.. ఆదుకోవడానికే తప్ప నిబంధనలు ఉండకూడదని వైఎస్సార్‌ తన పాలనలో అనేక సందర్భాల్లో నిరూపించారు. నిబంధనలు అంగీకరించవని అధికారులు చెబితే అవి ఆదుకోవడానికి ఉండాలి తప్ప ఏ విధంగా ఆదుకోకూడదో చెప్పడానికి కాదని, నిబంధనలు అంగీకరించకపోతే వాటిని సవరించైనా సాయం చేయాలని చెప్పి కోట్ల మందికి అండగా నిలిచారు. ‘నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించడమే గొప్ప నాయకుడి లక్షణం’ అన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ మాటను దశాబ్దం క్రితమే ఆచరణలో చేసి చూపించిన గొప్ప నేత. అందుకే ఆయన జీవించి ఉండగానే ప్రజలు ఎంతో అభిమానంతో ఆయన ఫొటోను తమ ఇళ్లల్లో పెట్టుకున్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆ ఫొటోను గుండెల్లో పదిలపర్చుకుని కొలుచుకుంటున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు, కన్నీళ్లూ దగ్గరుండి చూసి చలించిపోయిన నాయకుడు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు 2003లో రాష్ట్రంలో ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2004 మేలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే  రైతులకు ఉచిత విద్యుత్, రూ.2కే కిలో బియ్యం, గ్యాస్‌ సబ్సిడీ భారం భరించడం, 108, 104, ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు తదితర ఎన్నో పథకాలు, నిర్ణయాలతో కొత్త చరిత్ర సృష్టించారు. 76 పారిశ్రామిక సెజ్‌లను ఏర్పాటు చేసి, దాదాపు 2 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించారు. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించారు. అప్పట్లో ఐటీ ఎగుమతులు రూ.26 వేల కోట్లకు చేరుకోవడం ఓ రికార్డు.  

మరిన్ని వార్తలు