విజయ భగీరథుడు వైఎస్‌

8 Jul, 2018 10:40 IST|Sakshi

మహానేత జలయజ్ఞంతో జిల్లాలో   సాగునీటి ప్రాజెక్టులు

తోటపల్లి, జంఝావతి, తారకరామ, పెద్దగడ్డ ఆయన చలవే..

రూ.వందల కోట్లతో రిజర్వాయర్లు నిర్మించిన రైతు పక్షపాతి

వెనుకబడిన విజయనగరం జిల్లాలో సిరులు పండించిన ప్రజా సేవకుడు

జనం కష్టాలెరిగి పాలించిన నేత  

భౌతికంగా దూరమైనా గుండెచప్పుడై నిలిచిన నేత

నేల ఉన్నా నీరు లేక.. భూమున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా పంటలు కలిసిరాక బతుకుతెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న విజయనగం జిల్లా రైతుల పాలిట మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యాడు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించి చరిత్ర కెక్కారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్‌ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంబైశాతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి  ప్రజలను గట్టెక్కించేందుకు అహర్నిశలు శ్రమించారు. అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 69వ జయంతి(జూలై 8) సందర్భంగా ఆయన సేవలను తలచుకుంటూ జిల్లా వాసులు అంజలి ఘటిస్తున్నారు. 

సాక్షిప్రతినిధి, విజయనగరం: వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తలపెట్టిన జలయజ్ఞం పథకంలో విజయనగరం జిల్లాకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జిల్లా రైతుల సాగునీటి కష్టాల తీర్చాలన్న ధ్యేయంతో పనిచేశారు. ప్రాజెక్టులు నిర్మించి పంటల సాగుకు ఊతమిచ్చారు. ఆయన హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఓ సారి పరికిస్తే... బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపతూ తోటపల్లి సాగునీటి కాలువను నిర్మించారు. రూ.84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ  మండలంలో సూరాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్‌ రిజర్వాయర్‌ కాలువలు బాగు చేశారు. 

రబ్బరు డ్యామ్‌తో తీరిన సాగునీటి కష్టాలు... 
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976 లో జంఝావతి డ్యామ్‌కు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొ లగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏప్రీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినా ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో జంఝావతి డ్యాం రివర్‌ గ్యాప్‌ మూసివేయకుండా వదిలేశారు. దీంతో జంఝావతి నది గుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 రైతుల ఆవేదనను గమనించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో ఆస్ట్రియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్ట మొదట సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్‌ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. రబ్బరు డ్యామ్‌ లోపల భాగంలో 0.03 టీఎంసీలు నీరు నిల్వ ఉండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్‌ పేరు చెప్పగానే ఇక్కడ ప్రజలకు గుర్తుకువచ్చేది ముందుగా వైఎస్సార్‌. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పాచిపెంట పెద్దగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మించారు.

 ఇక్కడ ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రిజర్వాయర్‌ను 2006లో రాజశేఖర్‌రెడ్డి  ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరకు –పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపోయారు. పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పార్క్‌ ఏర్పాటు జరిగింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి  మిషన్‌బోట్‌లను తీసుకువచ్చారు.

రాజశేఖరరెడ్డి హయాంలోనే... 
గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి హయాంలోనే శంకుస్థాపన జరిగింది. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్‌ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్‌ ప్రారంభోత్సవాన్ని వై.ఎస్‌ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధుల కేటాయింపులు జరిగాయి. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్‌ కేటాయించడంలో వైఎస్‌ చొరవ తీసుకున్నారు. 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థంమంచినీటి పథకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు