మా దేవుడు వైఎస్సార్‌!

14 Jan, 2019 08:01 IST|Sakshi
వైఎస్సార్‌ చిత్రపటాన్ని శుభ్రం చేస్తున్న ధనమ్మ

పెద్దల పండుగనాడు వైఎస్సార్‌కి బట్టలు పెట్టనున్న వృద్ధురాలు

అన్నమయ్య సర్కిల్‌: ఆ వృద్ధురాలు తన ఇంట్లో దేవుడి చిత్రపటాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని ఉంచి నిత్యం పూజలు చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రతి సంక్రాంతికి తన ఇంటి పెద్దలతో పాటు వైఎస్సార్‌కి కూడా కొత్త బట్టలు పెట్టి మొక్కుతుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేనూతనపల్లి గ్రామానికి చెందిన ధనమ్మ (75) ఆదివారం తన నివాసం ముందు దేవుని పటాలతో పాటు వైఎస్సార్‌ చిత్ర పటాన్ని శుభ్రం చేస్తుండగా ఆమెను ‘సాక్షి’ పలకరించింది. ‘మా ఇంటి దేవుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. మేము కూలీ చేసుకుని బతికేటోళ్లం. రెక్కాడితే కానీ ముద్ద దిగదు. నా భర్త మునుస్వామికి అనుకోకుండా మోకాళ్లు నొప్పులు రావడంతో మంచం పట్టాడు. ఆ సమయంలో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్‌ చేయించుకున్నాము.

మాకు పింఛన్‌ మంజూరు చేసి దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చారు. ఆ దేవుడు ఇచ్చిన ఇంటిలో తలదాచుకుంటూ బతుకుతున్నాము. పదో తరగతి వరకు చదివిన నా కొడుకు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్‌ చనిపోయాక మళ్లీ మాకు కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. మళ్లీ ఆ దేవుడు రూపంలో ఆయన కొడుకు వైఎస్‌.జగన్‌ వస్తే మా బతుకుల్లో వెలుగు వస్తుందని ఆశతో జీవిస్తున్నాం. ప్రతి సంక్రాంతికి మా పెద్దలతో పాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కొత్తబట్టలు పెట్టి మొక్కుతుంటాము. అందుకే ఆ దేవుడి ఫొటో శుభ్రం చేస్తున్నా’. అని ధనమ్మ తెలిపింది.

మరిన్ని వార్తలు