రైతు బాంధవుడు

8 Jul, 2020 12:59 IST|Sakshi
నిజాంపట్నం పర్యటనలో వైఎస్సార్‌పై ప్రజలు కురిపించిన పూలవర్షం

అన్నదాతలపై మమకారానికి చిహ్నంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం  

కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ  

జిల్లా రైతులకు ఆయన పాలన సువర్ణ యుగం

జిల్లాలో 852 రైతు భరోసా కేంద్రాల్లో నేడు రైతు దినోత్సవం

సాక్షి, అమరావతి బ్యూరో:  రైతును రాజును చేయడానికి ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల గుండెల్లో రాజన్నను రైతు బాంధవుడిగా నిలిపింది. దీంతో దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 852 రైతు భరోసా కేంద్రాల్లో మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి వేడుకలను బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాపై రాజన్న  చెరగని ముద్ర వేశారు. టీడీపీ కంచుకోటకు బద్దలు కొట్టి 2004లో మొత్తం 19 నియోజకవర్గాల్లో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించి రాజకీయ ఉద్దండులను సైతం విస్మయపరిచారు. ముఖ్యమంత్రిగా జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. పులిచింతల ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు జీవం పోశారు. ఆరోగ్యశ్రీకి ఈ జిల్లాలోనే అంకురార్పణ చేసి లక్షలాది మంది రోగుల ప్రాణాలకు పురుడు పోశారు. గతంలో జిల్లాలో సీఎం హోదాలో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఎంత మమకారం ఉందో తెలుస్తోంది. 

రాజన్న పాలన రైతులకు సువర్ణ యుగం
దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాలన రైతులకు ఓ సువర్ణయుగం. రైతుల బతుకు చిత్రాన్ని మార్చే క్రమంలో జలయజ్ఞం కింద జిల్లాలో ఆయన పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారు. వైఎస్సార్‌ చివరి సంతకం చేసిన ఫైల్‌ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు.

జిల్లాకు అధిక ప్రాధాన్యం  
జిల్లా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కేటాయించడంతోపాటు, పథకాల అమలులో సైతం పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.7 లక్షల మందికి రూ.560 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభ జిల్లాలో ప్రారంభించి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు. ఇందిరమ్మ ఫేజ్‌–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు. రాజీవ్‌ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. గుంటూరు నగరానికి దాహర్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్‌ ప్లాంట్‌ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్‌ పాంట్ల వరకు రెండోపైపు లైను నిర్మించారు. నగర ప్రజల నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. రైతులకు విద్యుత్‌ బకాయి మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80వేల మంది రైతులకు లబ్ధి కలిగింది. విద్యుత్‌ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ.36 కోట్ల లబ్ధి కలిగింది. ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా జిల్లాలోని 80వేల మంది రైతులకు ఏడాదికి రూ.281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008 లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించడం జిల్లాప్రజలు మరిచిపోలేని తీపి జ్ఞాపకం. 

నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ. 4,444.41 కోట్లతో నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు  అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమడెల్టాలో  కాలువల ఆధునికీకరణ కోసం రూ.4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ. 1760.15 కోట్లను కాల్వల ఆధునికీకరణకు కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి.దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. మొత్తం మీద మహానేత కాలంలో జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లావాసుల్లో చెరగని ముద్రను వేసుకున్నారు.   

సాగునీటిప్రాజెక్టులకు పెద్ద పీట
జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు 2004 అక్టోబరు 15న రూ.680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి దాహర్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. దీనిని 2013 డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు