మేరునగ ధీరుడు

8 Jul, 2019 11:45 IST|Sakshi

విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్‌

డాక్టర్‌గా రూపాయికే వైద్య సేవలు

ఎమ్మెల్యేగా, ఎంపీగా హ్యాట్రిక్‌

ప్రతిపక్ష నేతగా ఎన్నో పోరాటాలు

సంతృప్తస్థాయిలో పథకాల అమలు

సాక్షి, అమరావతి:  రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారు  డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వైఎస్‌ రాజశేఖరరెడ్డిలోని నాయకత్వ లక్షణాలు చిన్ననాటి నుంచే వచ్చాయి. విజయవాడ లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడే మొలకెత్తిన నాయకత్వ పటిమ గుల్బర్గాలోని ఎంఆర్‌ వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తున్న సమయానికి ఆ కాలేజీ విద్యార్థి సంఘం నేతగా ఎదిగేలా చేసింది. అనంతరం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో హౌస్‌ సర్జన్‌ చేస్తున్నప్పుడు అక్కడి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేపట్టారు. హౌస్‌సర్జన్ల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థుల సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు. ప్రజల కష్టాలు, సమస్యలపై ఆనాటి నుంచే వైఎస్సార్‌కు తీవ్రంగా స్పందించే నైజం ఉండేది. తాను అభ్యసించిన వైద్య విద్య ద్వారా పేదలకు సేవలందించేలా ఆయన ముందుకు కదిలారు. జమ్మలమడుగులోని క్యాంప్‌బెల్‌ ఆస్పత్రిలో చేరి ప్రజలకు సేవలందిస్తూనే వైద్యాధికారిగా ఆ సంస్థ ఎదుగుదలకు తోడ్పడ్డారు. ఆ తరువాత తానే సొంత ఆస్పత్రిని ఏర్పాటు చేసి నిరుపేదలకు సేవలందించారు. అప్పట్లోనే ఆయన రూపాయి వైద్యుడిగా ప్రఖ్యాత పొందారంటే ఆయన సేవానిరతి ఎలాంటిదో అవగతం అవుతుంది. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు.

పోరాటమే ఊపిరిగా..
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తొలినుంచీ పోరాటమే ఊపిరిగా సాగుతూ వెళ్లారు వైఎస్సార్‌.  ప్రజల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని వైఎస్‌ ఏనాడూ ఆపలేదు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులపైనే పోరాటం సాగించిన ధీరత్వం వైఎస్‌ది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీలో హేమాహేమీలనదగ్గ సీనియర్‌ నేతలను ఢీకొట్టి తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయించిన పోరాట యోధుడుగా నిలిచారు. సిద్ధాంత పరంగానే తప్ప ఏనాడూ ఆయన పోరాటం వ్యక్తిగత స్థాయిలో ఉండేది కాదు. చివరకు 2004కు ముందు పూర్తిగా కుప్పకూలే దశలోకి చేరిన కాంగ్రెస్‌ పార్టీయే ఆయన బాటలో నడిచే పరిస్థితికి వచ్చింది. సొంత పార్టీలో అలా ఉంటే.. బయట తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక పాలనపై వైఎస్‌ పోరాటం మరో ఎత్తు. 1995 నుంచి 2004 ఎన్నికల వరకు చంద్రబాబు ప్రజాకంటక పాలనపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక రూపాల్లో పోరాటం సాగించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు చార్జీల పెంపు ఇలా ఎన్నో అంశాలపై ప్రజల తరఫున ప్రభుత్వంపై ఉద్యమించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై చివరకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదంటూ ఆమరణ నిరశన దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలతో నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 2003 ఏప్రిల్‌ 9 నుంచి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. మండు వేసవిలో 1,467 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు ప్రజలుబ్రహ్మరథం పట్టారు.  

కుటుంబ నేపథ్యం.. చదువు..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8వ తేదీన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని సీఎస్‌ఐ క్యాంప్‌బెల్‌ మిషన్‌ ఆస్పత్రిలో జన్మించారు. తల్లి జయమ్మ, తండ్రి రాజారెడ్డి. పాఠశాల విద్యను బళ్లారిలోని సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో పూర్తి చేశారు. విజయవాడ లయోలాలో కాలేజీ విద్య చదివారు. అనంతరం గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేశారు. తరువాత కొద్దిరోజుల పాటు జమ్మలమడుగులోని సీఎస్‌ఐ క్యాంప్‌బెల్‌ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేశారు. 1973 నుంచి పులివెందులలో తన తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందించారు. ఆ కాలంలోనే రూపాయి వైద్యునిగా పేరు ప్రఖ్యాతులందుకున్నారు. వైఎస్‌ కుటుంబం పులివెందులలో పాలిటెక్నిక్‌ కాలేజీని, డిగ్రీ కాలేజీని కూడా నెలకొల్పింది. పులివెందుల సమీపంలోని సింహాద్రిపురంలో ఒక కాలేజీని వైఎస్‌ కుటుంబం నిర్వహిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాగా ఇంకొకరు కుమార్తె షర్మిలారెడ్డి. వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి. వీరికి ఇద్దరు సంతానం. హర్షారెడ్డి, వర్షారెడ్డి. షర్మిల, అనిల్‌కుమార్‌ దంపతుల సంతానం రాజారెడ్డి, అంజలీరెడ్డి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్‌ వివేకానందరెడ్డి. ఈయన 1999, 2004 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1989 1994 ఎన్నికల్లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనను ఇటీవలే ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే.

ఇచ్చినహామీలేకాదు..మరెన్నోఅమలు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన ప్రభుత్వ పాలన మరో స్వర్ణ యుగమేనని చెప్పుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా పాదయాత్రలో ప్రజల బాధలను, కష్టాలను దగ్గర్నుంచి చూసిన నాయకుడిగా సమస్యలను పరిష్కరించే దిశగా అనేక పథకాలను అమలు చేశారు.  తన పాలనపై నమ్మకంతో కొత్త హామీలు ఇవ్వకుండానే 2009లో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తు అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటిని గుండె నిబ్బరంతో ఎదురొడ్డి నిలిచి ఎదుర్కొన్న ధీశాలి.  ఎంతో నేర్పు, ఓర్పులతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ అగ్రస్థానానికి ఎదిగిన మేరునగ ధీరుడు.  

 ఓటమి ఎరుగని నేత..
1975లో ఆంధ్రప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితులై పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978 ఎన్నికల్లో వైఎస్సార్‌ తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత వరుసగా 1983, 1985 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. అనంతరం రాజకీయాల్లో మరో మెట్టు ఎక్కి 1991, 1996, 1998 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. మళ్లీ 2004, 2009 ఎన్నికల్లో పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. తాను పోటీ చేసిన ఏనాడూ ఓటమి ఎరుగని నేతగా చరిత్ర పుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. 1980లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించారు. 1983 నుంచి 1985 వరకు, 1998 నుంచి 2000 వరకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999–2003 వరకు ప్రతిపక్ష నేతగా అనేక పోరాటాలు సాగించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా