వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

21 Jul, 2018 09:14 IST|Sakshi
విగ్రహాన్ని పరిశీలిస్తున్న తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు ధ్వంసమైన వైఎస్సార్‌ విగ్రహం

గొందిరెడ్డిపల్లిలో అర్ధరాత్రి ఘటన

ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ నేతలు

విగ్రహాల ధ్వంసం అనాగరిక చర్య

రాప్తాడు: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో గురువారం అర్ధరాత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భారీ శబ్దం రావడంతో సమీపంలోని వారు బయటకు వచ్చారు. వారిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం ఎం.బండమీదపల్లిలో ‘గ్రామ దర్శిని – గ్రామ వికాసం’ కార్యక్రమం జరిగింది. గొందిరెడ్డిపల్లి మీదుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రి పరిటాల సునీత దృష్టిలో పడి మెప్పు పొందేందుకు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విగ్రహాల ధ్వంసం పిరికిపందల చర్య
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి (చందు), జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు, యూత్‌ కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డిలు శుక్రవారం గొందిరెడ్డిపల్లికి వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. విగ్రహం వద్దే ఆందోళనకు దిగారు. దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపందల చర్య, అనాగరిక చర్య అని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) మండిపడ్డారు. గ్రామాల్లో రాజకీయ కక్షలను ప్రేరేపించేలా వైఎస్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఇంతలో ఎస్‌ఐ ధరణిబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి, కఠినంగా శిక్షించాలని నాయకులు వినతిపత్రం అందజేశారు. అరెస్టు చేయనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చందు హెచ్చరించారు.

పల్లెల్లో చిచ్చు పెట్టేందుకే..
తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని నాయకులు విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, బంధువులు పాలెగాళ్ల వ్యవస్థను తలపిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన మంత్రి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు విగ్రహాల ధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు పది విగ్రహాలు ధ్వంసమయ్యాయన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే గ్రామాలకు వెళ్లి ప్రజలకు తెలపాలే కానీ.. ఇలా విగ్రహాల ధ్వంసంతో రెచ్చగొట్టాలనుకోవడం మంచిది కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, జూటూరు శేఖర్, సింగారప్ప, యర్రగుంట కేశవరెడ్డి, గోవింద్‌రెడ్డి, సుబ్బరాయుడు, మాజీ సర్పంచులు బాబయ్య, వెంకట్రామిరెడ్డితోపాటు బాబయ్య, చిన్న ఓబిరెడ్డి, కొండారెడ్డి, కుమ్మర లక్ష్మినారాయణ, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, శంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, అంజన్‌రెడ్డి, కేశవరెడ్డి, నడిపి బాబయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు