రాజన్న రాజ్యంలోనే బీసీలకు స్వర్ణయుగం

16 Feb, 2019 12:32 IST|Sakshi

అన్ని పథకాలూ ఆయన పాలనలోనే..

బాబు హయాంలో అన్నీ మోసాలే

అమలాపురం: కులాల వారీగా కార్పొరేషన్లు అనే హడావిడి లేదు.. బీసీల అభ్యున్నతికి కోట్లు కేటాయిస్తున్నామనే డాంబికాలు లేవు... మా పార్టీనే బీసీలకు పెద్ద పీట వేసిందనే ఊకదంపుడు ఉపన్యాసాలు అంతకన్నా లేవు. ఉన్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం..కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా బీసీల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మాత్రమే. తమకు నిజమైన మేలు జరిగింది... వారికి ఉన్నత విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులోకి వచ్చింది వైఎస్సార్‌ హాయాంలోనేని బలహీనవర్గాల ప్రజలు నేటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. జిల్లాలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 2001–11 మధ్య కాలంలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో సుమారు 23.69 లక్షల మంది బీసీలు ఉన్నారని అంచనా.రాజ్యాధికారం ఇచ్చామని గొప్పలకు పోవడమే తప్ప అప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు బీసీలకు చేసింది ఏమీ లేదు. బీసీలు కుల వృత్తులకు ఉపయోగించే నాసిరకం పరికరాలను అందించి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే బీసీలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు వారి ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేశారు. బీసీల కులవృత్తులను ప్రోత్సహించడమే కాదు..వారికి ఉన్నత విద్య, ఉన్నత కొలువులు పొందేందుకు వీలుగా ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల సామాన్య బీసీ విద్యార్థులకు సహితం ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీల్లో చదువుకునే అవకాశం దక్కింది. 2007–08, 2008–09 కాలంలో జిల్లాలో ఏడాదికి సగటున 450 మంది వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేశారు.

 ఈ పథకంలో ఇంజినీరింగ్, మెడికల్‌ వంటి అత్యున్నత చదువులకు సంబంధించి ఫీజు పూర్తిగా రీయింబర్స్‌మెంట్‌ జరిగేది, ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. వందల మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే కల నెరవేరింది. తరువాత కాలంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరగడం వల్ల లబ్ధిపొందే బీసీ విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. వైఎస్సార్‌ తరువాత ముఖ్యమంత్రులుగా చేసినవారు ఈ పథకాలను కొనసాగించాల్సి రావడం వల్ల వేలాది మంది వరకు లబ్ధిపొందారు. ఇంజనీరింగ్‌తోపాటు వైద్యవిద్య కూడా సామాన్య బీసీ విద్యార్థికి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్‌ పథకానికి చంద్రబాబు సర్కార్‌ గ్రహణం పట్టించింది. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా 30 వేల వరకు మాత్రమే కళాశాలలకు చెల్లిస్తోంది. మిగిలిన ఫీజును విద్యార్థులు కట్టుకోవాల్సి వస్తోంది. ఇవేకాకుండా బీసీల ఉపకార వేతనాలను అవసరమైన స్థాయిలో పెంచింది కూడా వైఎస్సార్‌ మాత్రమే. బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించడం, ఉన్నవాటిని ఆధునికీకరించడం పెద్ద ఎత్తున సాగింది కూడా వైఎస్సార్‌ హయాంలోనే. 

ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ ఒక్కటే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎక్కువ లబ్ధిపొందింది కూడా బీసీలే. సాధారణ వ్యక్తులకు సైతం కార్పొరేట్‌ వైద్యం అందింది ఈ పథకంలోనే. అందుకే దివంగత నేత మరణించి పదేళ్లు కావస్తున్నా సామాన్యుల హృదయాలను కొల్లగొట్టారు. పింఛన్‌ పెంపు, కొత్తగా పింఛన్‌దార్లకు అవకాశం కల్పించడం, బీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు రాయితీలపై రుణాలు అందించడం ఇలా చెప్పుకూంటూ పోతే అట్టడుగు బీసీలకు వైఎస్సార్‌ హయాంలో జరిగిన మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

మరిన్ని వార్తలు