సరిగ్గా 15ఏళ్ల క్రితం ...వైఎస్సార్‌

13 May, 2019 19:45 IST|Sakshi

మే 14న మొద‌టిసారి ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం

అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగం

రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా దూసుకొచ్చిన మ‌హానేత

వైఎస్‌ జగన్ సారధ్యంలో త్వర‌లోనే రాజ‌న్న రాజ్యం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో 2004 మే 14 తేదీ మరిచిపోని రోజు. అదే రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు... అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు  వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన రోజు 14 మే 2004. సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నవశకానికి నాందీపలికారు.

డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన పాద‌యాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి... ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్సార్‌ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్‌’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు.

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, మే 14న  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మార్పుకు ఓ తొలి పొద్దుపొడుపు. అప్పటి దాకా దశాబ్ధాల పాటు కనిపించని, కనివినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆ రోజు ముహూర్త వేళ. ఆ అడుగుల ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం.  జనం నుంచి వచ్చిన నాయకుడు వైఎస్సార్‌. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచినవాడు వైఎస్సార్‌. ప్రజల ప్రేమాభిమానాలతోనే ఆయన సీఎం అయ్యారు. రాజకీయ పోరాటాలు, సుదీర్ఘ నిరీక్షణ...అన్నింటి మధ్య నుంచి వైయస్‌ఆర్‌ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా దూసుకొచ్చారు. 

ఓ చెరిగిపోని సంతకం
2004 నుంచి 2009 వరకు వైఎస్సార్‌ ఐదేళ్ల పాలన .. విశాలాంధ్ర ప్రదేశ్‌లో ఓ చెరిగిపోని సంతకం. రాష్ట్రం విడిపోయినా..రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌ అభిమానులు ఉన్నారు. ఆయనకు రుణపడి పోయామని చెప్పేవారు ఉన్నారు. ఈ రోజు మా బతుకుల్లో కనిపిస్తున్న వెలుగు వైఎస్సార్‌ పుణ్యమే అనే వారు ఎందరెందరో. నిజంగా వైఎస్సార్‌ రాజకీయ నాయకుల్లో అదృష్టవంతుడు. కోట్లాది మంది జనం ఇప్పటికీ ఆయనను తలుచుకోవడం అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే. ప్రజల జీవితాలను, మరీ ముఖ్యంగా పేదల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిన వైఎస్సార్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనను మరిచిపోని రాజన్నగా చేశాయి. రాజకీయ నాయకుల్లో పుణ్య పురుషుడిని చేశాయి.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
సరిగ్గా 15ఏళ్ల క్రితం..వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం

మరిన్ని వార్తలు