హర్‌ దిల్‌మే వైఎస్సార్‌

8 Apr, 2019 11:14 IST|Sakshi

బీసీ–ఈ కేటగిరీగా గుర్తింపుతో రుణాలు...

వైఎస్‌ఆర్‌ పథకాలతో ముస్లింల జీవితాల్లో వెలుగులు

సాక్షి, ఒంగోలు టూటౌన్‌: ‘హర్‌ దిల్‌ మే వైఎస్‌ఆర్‌’.. ప్రతి ముస్లిం నోట ఇదే మాట. తమ జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ గుండెల్లో కొలువై ఉన్నారని ముస్లింలు సగర్వంగా చెబుతున్నారు. వారి కోసం ఆయన అమలు చేసిన పథకాలను ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ముస్లింలు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముస్లింల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ పెద్ద పీట వేశారు. తద్వారా ఎంతోమంది నిరుపేద ముస్లింల జీవితాలు కాంతివంతంగా మారాయి. ప్రధానంగా ఆయన అమలు చేసిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఉచితంగా ఉన్నత విద్యనభ్యసించిన ముస్లింలు.. 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా ఎన్నో కుటుంబాలు పేదరికాన్ని జయించి మెరుగైన జీవన ప్రమాణాలను పొందుతున్నాయి. అంతేగాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేల మంది ముస్లింలకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం అందింది. గుండె ఆపరేషన్లను సైతం రూపాయి ఖర్చు లేకుండా చేయించుకున్నారు. బీసీ–ఈ కేటగిరీలో ముస్లింలను వైఎస్‌ఆర్‌ చేర్చడం ద్వారా వారికి అనేక విధాలుగా లబ్ధిచేకూరింది.

పిల్లలకు స్కాలర్‌షిప్పులు, బీసీ కార్పొరేషన్‌ రుణాలు వంటి వాటికి అర్హత దక్కింది. ఇవన్నీ వెరసి ముస్లింల దైవంగా వైఎస్‌ఆర్‌ను మార్చాయి. ఆయన ఆకస్మిక మరణం తర్వాత ముస్లింల గురించి ఆలోచించే పాలకులే లేకుండా పోయారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ పాలనలో తమకు జరిగిన మేలును ముస్లింలు మననం చేసుకుంటున్నారు. ఆయన బతికుంటే ముస్లింలకు మరెన్నో అవకాశాలు కల్పించేవారని, వైఎస్‌ఆర్‌ లేని లోటు తమకు తీర్చలేనిదని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో తమకు జరిగిన నష్టం గురించి ముస్లింలు చర్చించుకుంటున్నారు.

ముస్లిం విద్యార్థులకు నెలకు రూ.13 వేలు స్కాలర్‌షిప్‌...
ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు కళాశాల గ్రేడ్‌ను బట్టి రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ.26 వేల నుంచి రూ.27 వేల వరకు ఫీజులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా వైఎస్సార్‌ హయాంలో అందించారు. సంబంధిత కళాశాలల్లోనే ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్పు కింద నెలకు రూ.13 వేలు ఇచ్చారు. ఇంకా కాలేజీల ఫీజులతో సంబంధం లేకుండా మెయింటెనెన్స్‌ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.680 అందజేశారు. జిల్లాలో దాదాపు 500కుపైగా వివిధ కళాశాలలు ఉండగా, వాటి పరిధిలో దాదాపు మూడు వేల నుంచి ఆరు వేల మంది వరకు ముస్లిం విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్య అభ్యసించారు. వారికి ఏటా రూ.12 కోట్లకుపైగా వైఎస్‌ఆర్‌ పాలనలో చెల్లించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆయా కళాశాలలకు రెండు విడతల్లోనే వైఎస్‌ఆర్‌ చెల్లించేవారు. 

ముస్లిం మహిళల పేరుమీదే ఇళ్ల స్థల పట్టాలు...
జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలకు ఇళ్ల స్థలాలు కేటాయించి మహిళల పేరుమీదే పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్‌ఆర్‌ది. తద్వారా సరికొత్త కార్యక్రమానికి అప్పట్లో ఆయన శ్రీకారం చుట్టారు. జిల్లాలో కొన్ని వందల ముస్లిం కుటుంబాలకు ఆ సమయంలో లబ్ధిచేకూరింది. వారంతా సొంతిళ్లు నిర్మించుకుని ఇప్పుడు హాయిగా జీవిస్తున్నారు.

ఒంగోలులో షాదీఖానా, మసీదుల నిర్మాణం...
ఒంగోలులోని కొత్త మార్కెట్‌ సెంటర్‌లో షాదీఖానా నిర్మాణం జరిగిందంటే అది కేవలం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి మేరకు షాదీఖానాకు రూ.10 లక్షలను వైఎస్‌ఆర్‌ హయాంలో కేటాయించారు. షాదీఖానాకు శంకుస్థాపన కార్యక్రమానకి కూడా వైఎస్‌ఆర్‌ హాజరయ్యారు. అంతేగాకుండా ఒంగోలు నగరంలో ఐదు మసీదుల నిర్మాణానికి స్థలాలు కేటాయించి పట్టాలిచ్చారు. వాటి నిర్మాణానికి వైఎస్‌ఆర్, బాలినేని కృషే కారణమనే విషయాన్ని ఆయా ప్రాంతాల్లోని ముస్లింలు నేటికీ గుర్తుచేసుకుంటున్నారు.

ముస్లింలపై ప్రభావం చూపుతున్న ఆరోగ్య శ్రీ పథకం...
పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఒక పెద్ద వరమైంది. జిల్లాలో వేల మంది ముస్లింలు ఈ పథకం ద్వారా నాణ్యమైన కార్పొరేట్‌ వైద్యం పొందారు. వైఎస్‌ఆర్‌ పథకాలను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఈ పథకాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అటకెక్కించారు. హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఫలితంగా నేడు నిరుపేదలు కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని పరిస్థితి నెలకొంది. సర్కార్‌ వైద్యశాలల్లో నామమాత్రపు వైద్యసేవలు కూడా అందకపోతుండటంతో వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు నాణ్యమైన వైద్యసేవలు దూరమయ్యాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిర్వీర్యంతో ముస్లింలకు టీడీపీ అన్యాయం...
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. వైఎస్‌ఆర్‌ హయాంలో రెండు విడతల్లో కళాశాలలకు చెల్లించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను మూడు, నాలుగు విడతలుగా కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో విద్యార్థులపై ఆయా కళాశాలల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది. పేద ముస్లింలు ప్రశాంతంగా చదువుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ పలు కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో ముస్లిం విద్యార్థులతో పాటు ఇతర పేద విద్యార్థుల ఉన్నత విద్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్, 4 శాతం రిజర్వేషన్లతో మేము ఉన్నతంగా స్థిరపడ్డాం
మాది నిరుపేద కుటుంబం. మేము ఇద్దరు ఆడపిల్లలం. ఒక మగ పిల్లవాడు. ఎలాగైనా కష్టపడి మమ్మల్ని చదివించాలన్న తపన మా నాన్నకు ఉండేది. కానీ, ఫీజుల భారాన్ని ఆయన మోయలేకపోయారు. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశ మాకు ఉన్నప్పటికీ ముగ్గురుం చదవాలంటే ఆర్థికంగా కుదిరే పనికాదు. అలాంటి పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఆ పథకం ఉందన్న ధైర్యంతో నేను మెడిసిన్‌ సీటు సాధించి ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత మా చెల్లి షర్మిలా కూడా నా బాటలోనే ముందుకు సాగింది. ఆమె కూడా మెడిసిన్‌ సీటు దక్కించుకుని ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం మా చెల్లెలు అమెరికాలోని అట్లాంటాలో ఉద్యోగం చేస్తుం   డగా, వైఎస్‌ఆర్‌ అమలుచేసిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లతో నేను ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మేము ఉన్నత స్థానంలో ఉన్నామంటే వైఎస్‌ఆరే కారణం. ఆయన ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు.
– ఎస్‌కే రేష్మా, ఇస్లాంపేట, ఒంగోలు

ముస్లిం మైనార్టీలకు ఉన్నత విద్యను దగ్గర చేసింది వైఎస్సారే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతో మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. వారంతా ఈ రోజు ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో వేలాది మంది ముస్లిం పిల్లలను ఉన్నత విద్య వైపు మళ్లించిన ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కుతుంది. దాంతో పాటు ఆరోగ్యశ్రీ, 4 శాతం రిజర్వేషన్లు, బీసీ–ఈగా గుర్తింపు, 1 నుంచి 10వ తరగతి వరకు స్కాలర్‌షిప్పులు, రుణాలు.. వంటి పథకాలతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో వైఎస్‌ఆర్‌ వెలుగులు నింపారు. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన మాకు దైవంతో సమానం. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
– జలీల్‌ఖాన్, ఇస్లాంపేట, ఒంగోలు

ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు వైఎస్‌ఆర్‌ పుణ్యమే 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల్పించిన రిజర్వేషన్లతో ఎంతో మందికి మేలు జరిగింది. 4 శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం మైనార్టీల్లో అభివృద్ధి కనిపించింది. నిరుపేదల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ముస్లింల జీవితాల్లో మార్పు వైఎస్‌ఆర్‌ పుణ్యమే.                         
- ఎస్‌కే మస్తాన్‌వలి, కో ఆప్షన్‌ సభ్యుడు, కనిగిరి

మరిన్ని వార్తలు