వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

3 Jul, 2019 11:08 IST|Sakshi
చందలూరులో దుండగుల దాడిలో దెబ్బతిన్న వైఎస్సార్‌ విగ్రహం (ఇన్‌సెట్లో) విరిగిపడిన విగ్రహ చేతులు

సాక్షి, రుద్రవరం(కర్నూలు) : మండలంలోని చందలూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని దుండగులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహంపై దాడి చేశారు. విగ్రహం కుడి, ఎడమ చేతులను మనికట్ల వరకు విరగ్గొట్టారు. ఇలా చేయడంపై గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 2012లో ప్రభుత్వ పాఠశాలకు కొద్ది దూరంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి వైఎస్సార్‌ జయంతి,వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పిస్తున్నారు. 

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెవెన్యూ అధికారుల ఆదేశానుసారం గ్రామసేవకుడు.. వైఎస్సార్‌ విగ్రహానికి ముసుగు వేశారు. దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అప్పట్లో శ్రీనివాసులు అభ్యంతరం చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఆ ముసుగు తొలగించారు. కాగా..మంగళవారం ఉదయం విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసి శ్రీనివాసులుతో పాటు గ్రామానికి చెందిన గ్రీన్‌అంబాసిడర్‌ చింతలయ్య పరిశీలించారు. తర్వాత ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా తెలియడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరిశీలించారు. రుద్రవరం ఎస్‌ఐ విష్ణునారాయణ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మహానేతల విగ్రహాల జోలికెళ్తే కఠిన చర్యలు : డీఎస్పీ 
మహానేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ తిప్పేస్వామి హెచ్చరించారు. చందలూరులో దుండగుల చేతిలో దెబ్బతిన్న వైఎస్‌ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పని హెచ్చరించారు. ప్రత్యేక బలగాలతో వచ్చిన ఆయన ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామంలో కలియదిరిగారు. 

నూతన విగ్రహం ప్రతిష్టిస్తాం 
‘సౌమ్యంగా ఉన్నారు..ఏమి చేసినా పట్టించుకోరని అనుకుంటున్నారేమో! ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేద’ని శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి సోదరుడు గంగుల మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన డీఎస్పీతో కలిసి వైఎస్సార్‌ విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులను త్వరగా గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ వైఎస్‌ జయంతి సందర్భంగా నూతన విగ్రహం ప్రతిష్టించి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గందం రాఘవరెడ్డి, హనుమంతరెడ్డి, మహేశ్వరెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి, శంకర్, నంబర్‌వన్‌ ఉశేన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు