రైతు బాంధవుడు వైఎస్సార్

14 Jan, 2014 02:16 IST|Sakshi

పర్చూరు, న్యూస్‌లైన్: రైతులకు ఉచిత విద్యుత్ అందించి, రుణాలు మాఫీ చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుబాంధవునిగా నిలిచారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీనటి రోజా పేర్కొన్నారు. మండలంలోని నూతలపాడులో గొట్టిపాటి నరశింహారావు ప్రాంగణంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ మెమోరియల్ రాష్ర్ట స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలకు సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోజాకు నిర్వాహకులు, ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. పశుపోషకులను గొట్టిపాటి భరత్‌తో కలిసి ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, పిండివంటలతో పాటు ఎడ్ల పందేలు గ్రామాల్లో సంక్రాంతి పండుగకు అద్దం పడతాయన్నారు. రాజసం, పోటీలకు ఒంగోలు గిత్తలు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎడ్ల యజమానులను, ప్రేక్షకులను అభినందించారు. వైఎస్ జగన్‌మోహ న్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన తండ్రిలాగే చల్లని పరిపాలన అందిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, గొట్టిపాటి భరత్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
 
 ట్రాక్టర్ నడిపి ప్రేక్షకులను ఉత్సాహపరచిన రోజా
 పోటీల్లో ప్రదర్శనగా ఉంచిన ట్రాక్టరును రోజా నడిపి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ట్రాక్టర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, పార్టీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి కూర్చున్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు ఈలలు, కేకలతో సందడి చేశారు.  
 
 ఎడ్ల పోటీలను చూసేందుకు పోటెత్తిన జనం
 నూతలపాడులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు జనం పోటెత్తారు. రెండో రోజైన సోమవారం నూతన సేద్యపు ఎడ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలకు వైఎస్సార్ సీపీ రాష్ర్ట రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సజ్జా హేమలత, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకుడు దగ్గుమాటి కోటిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పశుపోషకులకు అనేక రాయితీ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఏ పశుజాతికీ లేని ప్రత్యేక లక్షణాలు ఒంగోలు జాతికి మాత్రమే ఉన్నాయన్నారు. ఒంగోలు జాతి పశువులను ఇతర దేశస్తులు మాంసం కోసం వినియోగించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో పర్చూరు, నూతలపాడు గ్రామ సర్పంచ్‌లు యద్దనపూడి సరోజని, కే సుమలత, సంతమాగులూరు సొసైటీ అధ్యక్షుడు అట్లా చినవెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు