పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా?

21 Mar, 2019 04:52 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సునీతమ్మ, రాజశేఖరరెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఆవేదన

మా నాన్న ప్రజల మనిషి..ఆయన మృతితో చాలా బాధలో ఉన్నాం

మీడియాలో వార్తలు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి

చనిపోయిన వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు?

విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఎలా చేస్తారు?

సిట్‌ ఏర్పాటు చేశారు కదా

నిష్పక్షపాత విచారణకు అవకాశమివ్వండి

మా కుటుంబం గురించి అవగాహన లేనివాళ్లే దుష్ప్రచారం చేస్తున్నారు

జగనన్న ముఖ్యమంత్రి కావాలని నాన్న చాలా కష్టపడేవారు

సాక్షి ప్రతినిధి, కడప: నాన్నను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా బాధ కలిగిస్తోందన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానాలు చేయొద్దని.. పూర్తి నిష్పక్షపాత విచారణకు అవకాశమివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బుధవారం పులివెందులలోని తమ ఇంటి ఆవరణలో భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మానాన్న ప్రజల మనిషి. పులివెందుల అన్నా.. పులివెందుల ప్రజలన్నా ఆయనకు చాలా ఇష్టం. తొలి ప్రాధాన్యత ప్రజలే. ఆ తర్వాతే కుటుంబం ఆయనకు.

మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అమ్మ నా దగ్గరే ఉండేది. పులివెందులలో ఉంటున్న నాన్న బాగోగులను ఆయన సన్నిహితులు చూసుకుంటూ ఉండేవారు. ఉదయం 5.30 నుంచి నాన్న పడుకునే వరకూ ఎవరో ఒకరు ఆయనతో ఉండేవారు. ఇప్పుడు నాన్న చనిపోయారు. మేమంతా చాలా దుఃఖంలో ఉన్నాం. ఘటన తర్వాత పేపర్లలో, టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతోంది. మా నాన్న చాలా గొప్పవ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. మీకందరీకి తెలుసు ఆయన హుందాతనం. కానీ ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే వారి గురించి చెడుగా మాట్లాడొద్దని చెబుతాం. కానీ అవేమీ పట్టించుకోకుండా మా నాన్న గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. 

నిష్పక్షపాత విచారణకు అవకాశం ఇవ్వండి..
నాకు గానీ, మీకు గానీ ఈ కిరాతకమైన పని ఎవరు చేశారో వెలికి తీయడమే కావాలి. అది జరగాలంటే నిష్పక్షపాత విచారణకు అవకాశమివ్వాలి. దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. అయినా కూడా విచారణను ప్రభావితం చేసేలా కొందరు మాట్లాడుతున్నారు. పెద్ద మనుషులు మీరు.. పెద్ద హోదాలో ఉండే మీరే ఏవి పడితే అవి మాట్లాడి విచారణను ప్రభావితం చేస్తే ఎలా? ఇక నిష్పక్షపాత విచారణ ఎట్లా జరుగుతుంది? కేసును పూర్తిగా పక్క దారి పట్టించే యత్నం చేస్తున్నారు. మీడియా, రాజకీయ నేతలు.. మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించొద్దు. నిష్పక్షపాత విచారణ జరిగితేనే కదా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చేది. 

మా గురించి తెలుసుకొని మాట్లాడండి..
జగనన్న ముఖ్యమంత్రి కావాలని మా నాన్న చాలా కష్టపడ్డారు. ఇంతలో ఇలా జరిగిపోయింది. కొందరు మా కుటుంబం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మా గురించి అవగాహన లేనివారే విమర్శలు చేస్తున్నారు. మా కుటుంబంలో 700 మందికి పైగా ఉన్నారు. వారిలో వివిధ అభిప్రాయాలుంటాయి.. వివిధ రకాల మనుషులుంటారు. వారంతా వివిధ మతాల్లో.. వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నారు. అయినా మేమంతా పరస్పరం గౌరవించుకుంటాం. వీలున్న ప్రతి ఒక్కరం ఏటా ఒక్కసారైనా కలుస్తాం. ఈ ఏడాది రెండుసార్లు కలిశాం. మా గురించి తెలుసుకొని మాట్లాడండి. 

వారికి, నాకు తేడా ఏముంటుంది?
ఊహాగానాలు చెబుతూ దానిపై చర్చలు కొనసాగిస్తే విచారణ ఎలా సాధ్యం? అప్పుడు నాకు, పెద్దవాళ్లకు తేడా ఏముంటుంది? నేను ఒకమాట చెబితే దాని గురించి ప్రపంచమంతా ప్రచారం చేస్తారు. అప్పుడు నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యమవుతుంది. పెద్దవాళ్లు కూడా అలా చేయకండి? మాకు నిష్పక్షపాత విచారణ కావాలి. దర్యాప్తు సంస్థ పేరు ఏదైనా కానీయండి.. మీరు ఎవరి కోసమో కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి’ అని సునీత కోరారు.

నా బాధను అర్థం చేసుకోండి..
సన్నిహితులే ఆధారాలు చెరిపేశారంటూ సీఎం చంద్రబాబు తదితరులు చేస్తున్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు సునీత స్పందిస్తూ.. ‘నాన్నకు చాలా మంది సన్నిహితులున్నారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో మేము ఇక్కడ లేము. ఎవరికైనా క్లియర్‌గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? క్లారిటీ మైండ్‌ ఉంటుందా? చనిపోయిన వ్యక్తి గురించి రకరకాలుగా ఆరోపిస్తుంటే కూతురిగా చాలా బాధపడుతున్నా. నా బాధను అర్థం చేసుకోండి. నిష్పక్షపాత విచారణకు ఆస్కారం ఇవ్వండి’ అని వివేకానందరెడ్డి కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు