పురోహితులను ఆదుకోండి

18 Apr, 2020 04:10 IST|Sakshi

భవానీపురం (విజయవాడ పశ్చిమ): పితృకర్మలు నిర్వహించే పురోహితులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధిలేక అవస్థలు పడుతుండడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్‌ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు అపరకర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ, లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంది.

ఈ విషయం వైఎస్‌ విజయమ్మ దృష్టికి వెళ్లింది. మానవత్వంతో స్పందించిన ఆమె.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడి పురోహితులను ఆదుకోవాలని సూచించారు. దీంతో.. ఆమె సూచన మేరకు మంత్రి వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.  

మరిన్ని వార్తలు