జగన్‌ను మీరే కాపాడుకోండి

12 Nov, 2018 02:31 IST|Sakshi
లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ విజయమ్మ. చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, వాసిరెడ్డి పద్మ

ప్రజలకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వినతి

జగన్‌ పై హత్యాయత్నం కేసు ప్రారంభమై 17 రోజులు అవుతుంది. ఏమాత్రం ముందుకు పోలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఈ రోజు వాళ్లందరూ అంటున్నదేమిటి? గాయం ఎంత లోతుంది? ఎంత పొడవుంది? చిన్న కత్తే కదా? అని మాట్లాడుతున్నారు. డీజీపీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌.. వాళ్లందరూ అదే మాట్లాడుతున్నారు. కేసు గురించి విచారణ ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ లేదు. అన్నీ అసత్య ప్రకటనలే. రోజుకో మాట, పూటకో సాక్ష్యం పుట్టిస్తున్నారు.

నిజానికి జగన్‌కు ఇదో పునర్జన్మ. ఎందుకంటే.. గొంతులో దిగాల్సిన కత్తి ఆయన భుజానికి తగిలింది కాబట్టే అంతపెద్ద ప్రాణాపాయం నుంచి దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనల వల్ల తప్పించుకోగలిగాడని అనుకుంటున్నా.

నా బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలోనే ప్రజలందరి మధ్యలో చెప్పాను. రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఏడేళ్ల కాలంలో.. జగన్‌ జైల్లో ఉన్న 16 నెలలు తప్పించి మిగతా కాలమంతా మా కంటే కూడా ప్రజల మధ్యలోనే ఎక్కువగా ఉన్నారు.

రాజశేఖరరెడ్డి గారి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల పరామర్శకు వచ్చిన జగన్‌కు మీరు ఓదార్పు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి సమస్యలోనూ ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు చేస్తూ తన కడుపు మాడ్చుకుంటూ కూడా జనంతో మమేకమయ్యాడు.

గుంటూరులో గానీ, గోదావరి జిల్లాల్లో గానీ పాదయాత్రలో ఉండగా జగన్‌ను అంతం చేయాలని రెక్కీ జరిగిందని, అది వీలుకాకపోవడం వల్లే విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని ఈ రోజు వింటున్నా. మీరున్న (ప్రజలు) చోట జగన్‌ను ఏదన్నా చేస్తే చేసిన వారు ఉండరు కాబట్టే మీరు లేని విమానాశ్రయాన్ని ఎంచుకున్నారనుకుంటున్నా.  

రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత వైఎస్సార్‌ కుటుంబంపై అనేక నిందలు, నేరారోపణలతో, నిరాధారమైన ఆరోపణలతో దాడులు చేస్తున్నారు. ఓ తల్లి మీద మాట్లాడుతున్నారు, చెల్లి మీద మాట్లాడుతున్నారు. భార్య మీద మాట్లాడుతున్నారు. వాటన్నింటినీ మౌనంగా భరిస్తున్నాం. సహిస్తున్నాం.  

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారు ఏ కాంగ్రెస్‌ పార్టీకైతే 30 ఏళ్లపాటు సేవ చేశారో, జీవం పోశారో ఆ పార్టీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారికి, ఆయన కుటుంబానికి చేసిందేమిటి? కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు. ఈ రోజుకూ వైఎస్‌ కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఏడిపిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌ నిరంకుశత్వం, టీడీపీ వికృత చేష్టలనే అనుకోవాలి.

సాక్షి, హైదరాబాద్‌ :‘జగన్‌ను ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరు. జగన్‌కు ఇది పునర్జన్మ. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. రక్షణ బాధ్యత ఇక మీదే’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గద్గద స్వరంతో రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. జగన్‌పై హత్యాయత్నం అనంతరం 17 రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. జనం మధ్యకు వస్తున్న జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల కోసం, జగన్‌ క్షేమం కోసం ప్రార్థనలు చేయగలనే కానీ, తన కుమారుడికి జనమే భరోసా ఇవ్వాలని ఆమె ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే..

మీ అందరికీ రుణపడి ఉన్నాం..
‘‘జగన్‌ తిరిగి మరోసారి ప్రజల మధ్యకు వెళుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఓ విన్నపాన్ని తెలపడానికి మీడియా ఎదుట నిలబడ్డాను. ఇంకా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో రుణపడి ఉన్నాం. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, తల్లులకు, పిల్లలకు, అవ్వాతాతలకు, మీడియా పెద్దలకు, ప్రతి సన్నిహితునికీ, ప్రతి స్నేహితునికీ, రాజశేఖరరెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని ప్రేమించే ప్రతి హృదయానికి పేరుపేరునా హృదయ పూర్వక నమస్కారాలు. ఈ సమయంలో జగన్‌ కోలుకోవాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. వారందరికీ మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రాజశేఖరరెడ్డి గారి కుటుంబానికి 40, 45 ఏళ్ల అనుబంధం ఉంది. రాజశేఖరరెడ్డి గారిని ఒక నాయకునిగా గుర్తించి 30 ఏళ్ల పాటు ఆదరించారు. అభిమానించారు. భుజాలపై పెట్టుకుని మోశారు. రాజశేఖరరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని అలాగే చూసుకున్నారు. ఒక తండ్రిగా ప్రతి కుటుంబానికీ సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు చేశారు. ప్రజలందరినీ ఆ రోజుల్లో కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. జగన్‌ కూడా ఎప్పుడూ ఓ మాట అంటుంటాడు.. నాన్న నన్ను ఎప్పుడూ ఒంటరిని చేయలేదు.. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని చెబుతుండటం మీ అందరికీ తెలిసిందే.  
థర్డ్‌ పార్టీ విచారణ అనవసరం

అని ఎలా చెబుతారు?  
ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే సెక్యూరిటీ లేకపోతే మరెక్కడ ఉంటుంది? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వకపోతే మరెవరికి ఇస్తారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. వీఐపీ లాంజ్‌లోకి గుండు సూది కూడా పోదు. అన్నింటినీ చెక్‌ చేస్తారు. నెయిల్‌ కట్టర్లు, చిన్న సీజర్లు.. బ్లేడు ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఈరోజు ఒక వీఐపీ లాంజ్‌లోకి కత్తులు ఎలా వెళ్లాయి? ఎవరు సహాయం చేస్తున్నారు? ఎవరి ప్రోద్బలం వల్ల ఇది జరిగిందనే దానిపై అసలు ఎంక్వయిరీనే లేదు. అక్కడే క్యాంటీన్‌ ఓనర్‌ ఉన్నారు. నిందితుడు అక్కడే ఎనిమిది నెలలుగా పని చేస్తున్నారంటున్నారు. ఆయన మీద కూడా తూతూ మంత్రంగా విచారణ జరిపారు. ప్రతీదీ ఇంతే. సంఘటన జరిగిన గంటలోపే ఎటువంటి విచారణ లేకుండానే డీజీపీ మీడియా ముందుకు వచ్చి జగన్‌ అభిమానే ఈ పని చేశారని, అది చిన్న గాయం అని చెబుతారు. విచారణ లేకుండా ఎందుకు చెప్పారు, ఎలా చెప్పగలిగారని అడుగుతున్నా? ముఖ్యమంత్రి కూడా లైన్లోకి వచ్చి అదే మాట్లాడతారు. ఇంత చిన్నదానికి ఎంక్వయిరీ అవసరం లేదంటాడు. థర్డ్‌ పార్టీ ఎంక్వయిరీ అస్సలు అవసరం లేదని అంటాడు. ఎంక్వయిరీ అవసరం లేదని మీరు ఎలా చెప్పగలుగుతారని నేను చంద్రబాబు నాయుణ్ణి అడుగుతున్నా. అలిపిరి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు మీ (చంద్రబాబు) వద్దకు వచ్చి మిమ్మల్ని హత్తుకుని, పరామర్శించి దేవుడు గొప్పవాడు, దేవుని దయ వల్ల బతికావని చెప్పి గాంధీ విగ్రహం వద్ద కూర్చుని ధర్నా చేసిన సంస్కృతి ఆయనది. మరి ఈయన (చంద్రబాబు) సంస్కృతి ఏమిటని అడుగుతున్నా.

మీడియా నిజాలు నిర్భయంగా చెప్పాలి
ఆ రోజు నా బిడ్డను నా చేతులతో ప్రజలకు అప్పగించాను. మీ క్షేమం, జగన్‌ క్షేమం కోసం ప్రార్థించగలనే కానీ భరోసా ఇవ్వాల్సింది, మాట ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మిమ్మల్ని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. నా బిడ్డను ఇంతకు ముందు కాపాడుకున్న మీరు ఇక ముందు కూడా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే హత్యాయత్నం చేయించారో వారికి కూడా నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయొద్దని. రాజశేఖరరెడ్డి గారిని పోగొట్టుకుని ఈ రోజుకు కూడా నేను, నా కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి నా కడుపు మీద కొట్టొద్దని (గద్గద స్వరంతో) వేడుకుంటున్నా. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరుతున్నా. ఒకటే నేను మనవి చేస్తున్నా. ఎవరూ చూడలేదని అనుకోకండి. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుందేమో! ఆరకంగా ఎవరూ అనుకోవద్దు. దేవుడు చూస్తుంటాడు. మనం చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర అకౌంటబులిటీ ఉంటుందనేది మరిచిపోవద్దు. పత్రికా ప్రతినిధులకు కూడా ఒకటి చెబుతున్నా.. మీరు సమాజానికి మంచి వారధులుగా ఉండాలని కోరుతున్నా. పత్రికలు, చానళ్లు నిజం నిర్భయంగా చెప్పగలగడం సమాజానికి శ్రేయస్కరం. దయచేసి నిజాలు చూపించండి. నిజాలు చెప్పండి.

ఇంత వెకిలిగా మాట్లాడతారా?
హత్యాయత్నం చేసినతడు జగన్‌ దగ్గరకు వచ్చి మీతో సెల్ఫీ తీసుకుంటానన్నాడు. 164 సీట్లు వస్తాయి.. ముఖ్యమంత్రి అవుతారంటూ కత్తితో జగన్‌ గొంతుపై పొడవడానికి ప్రయత్నించగా జగన్‌ పక్కకు జరగడంతో కత్తి భుజానికి తగిలి గాయమైంది. అదే గొంతుకు తగిలుంటే ప్రాణం పోయేదని డాక్టర్లు చెబుతున్నారు. అప్పటికే విమానం బయలు దేరడానికి సిద్ధంగా ఉందని, ఫైనల్‌ కాల్‌ వచ్చిందంటూ ప్రొటోకాల్‌ సిబ్బంది వచ్చి పిలిచారు. దీంతో అక్కడ ఉన్నవారు ఆ అబ్బాయిని (నిందితుడిని) కొట్టడానికి ప్రయత్నించగా.. ‘కొట్టొద్దండి.. పిచ్చోడండీ.. వదిలేయండి’అని జగన్‌ చెప్పాడు. అప్పటి వరకు అంత గాయం అయిందని ఎవరూ అనుకోలేదు. భుజానికి రక్తం కారు తుండటంతో ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి చొక్కా మార్పించారు. రాజశేఖరరెడ్డి గారికి గానీ, జగన్‌కు గానీ నాటకాలు ఆడటం, అబద్ధాలు చెప్పడం చేత కాదు. నమ్మిన వారికి ప్రాణం పెట్టడమే వారికి తెలుసు. నమ్మిన వారిని రిస్క్‌లో పెట్టడం వాళ్లకు తెలియదు. కాబట్టి జగన్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ చేయించుకున్నాక విమానం రెడీగా ఉంది కాబట్టి మరో ఆలోచన లేకుండా ఇక్కడికి వచ్చారు. దానిని కూడా ఎంత వెకిలిగా మాట్లాడారో.. పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. మాట్లాడనీయండి ఏం పర్వాలేదు. దేవుడు చూస్తా ఉంటారు.  

జగన్‌కు నాటకాలాడటం రాదు..
చిన్న కోడికత్తి అంటున్నారు. ఆ కోడికత్తితోనే జగన్‌కు 3.5 నుంచి నాలుగు సెంటీమీటర్ల వరకూ గాయమైంది. అదే వారు (టీడీపీ వారు) చెప్పినట్లు 0.5 సెంటీ మీటర్లు మాత్రమే గాయమైతే భుజంపై కత్తి నిలబడేది కాదు. ఆయన మజిల్‌లోకి దిగిన కత్తి అలాగే ఉండిపోయింది. అంటే గాయం లోతుగా అయినట్టే కదా.. అదే గాయం గొంతుకే గనుక తగిలుంటే ప్రాణం పోయుండేది. జగన్‌ హైదరాబాద్‌కు రాకముందే డీజీపీ లైన్‌లోకి వచ్చారు. అంత అర్జెంట్‌గా ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా అనుకున్నది చెప్పేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి గారు అదేమాట. జగన్‌ ఒకవేళ డ్రామా చేయాలనుకునేవాడైతే రక్తం ఉన్న అదే షర్టు వేసుకుని, ఏడవటం లాంటివి చేసి ఉండేవారు. రాజశేఖరరెడ్డి గారు, దేవుడు.. జగన్‌కు చాలా గుండె దిటవు ఇచ్చారు. కష్టాలు, బాధలు వాళ్లు మాత్రమే భరిస్తారు. సంతోషాన్ని బయటకు పంచుకుంటారు. సోషల్‌ మీడియాలో వచ్చే వాటి వల్ల ఎక్కడ గొడవలు జరుగుతాయేమోనని జగన్‌ సంయమనం పాటించి తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందొద్దని చెప్పి విమానం ఎక్కారు.  

ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు
ఇన్ని రోజులుగా టీవీ చానళ్లు విపరీతంగా చూపిస్తున్నాయి. విశ్లేషణలు చూపుతున్నాయి. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఎందుకంత హడావుడి? ఈ రోజు థర్డ్‌ పార్టీ ఎంక్వయిరీ చేయించడానికి ఎందుకంత భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందు కేంద్ర ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలను కొనసాగించుకుంటున్నారు? రాష్ట్ర పోలీసులపై సీఎంకు నమ్మకం లేదా? మాకు ఏపీ పోలీసులపై నమ్మకం లేక కాదు. ఈ ప్రభుత్వంలో ఉండేవారిపైనే నమ్మకం లేదు. రోజుకొక అబద్ధం.. పూటకో ఫ్లెక్సీ సృష్టిస్తున్నారు. పది గంటల తర్వాత లేఖ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మమంటారు? అందుకే స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరుతున్నాం. మా నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. జగన్‌కు కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాల భద్రత కల్పించాలని మా నాయకులు కోరుతున్నారు. దేవుని దయ, మీ అందరి ఆశీర్వాదం వల్ల జగన్‌కు పర్వాలేదు. అయితే చేతులు పైకెత్తి నమస్కారం పెట్టవద్దని డాక్టర్లు సూచించారు’’అని విజయమ్మ అన్నారు.   

ఎన్ని చేసినా జగన్‌ తలవంచలేదు
ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర 11 జిల్లాల మీదుగా సాగి.. 3,200 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుందంటే, మీరు చూపిన ఆదరణ, ప్రేమాభిమానాలే కారణం. జన సంద్రమై కదిలి వచ్చి పెట్టనికోటగా నిలిచి మీరు ఆ బిడ్డను కాపాడుకున్నారు. ఎందుకు పెట్టని కోటగా అంటున్నానంటే.. ప్రతిపక్ష నాయకునిపై దాడి జరుగుతుందని 4, 5 నెలల కిందట ఓ పెద్దమనిషి చెప్పాడు. ఆ రోజున నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే జగన్‌ ప్రజల మధ్య ఉన్నాడు. 2009 సంవత్సరం నుంచి వారందరూ కలిసి జగన్‌ను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ, ఐటీ, ఈడీ ఎంక్వైరీలు, కేసులు, రైడ్‌లు, అటాచ్‌మెంట్లు ఇలా ఒకటి కాదు.. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. చెప్పాలంటే భారతదేశంలో ఏ నాయకుని మీద ఇలాంటి చర్యలు జరిగి ఉండవు. నేను చూసినంత మేరలో వినలేదు. ఇవన్నీ కాకుండా తొమ్మిదేళ్ల తర్వాత నా కోడలు భారతమ్మను కూడా ఈడీ దర్యాప్తులో చేర్చాలని ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. వ్యవస్థలలో వాళ్ల మనుషుల్ని పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎన్ని చేసినా జగన్‌ బాబు దేనికీ చలించలేదు. దేనికీ చెక్కు చెదరలేదు. భయపడలేదు. అదరలేదు. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి మీ మంచి కోసం, మీ క్షేమం కోసం మీమధ్యలోనే ఉండి పోరాడుతున్నారు. దేనికీ, ఎవరికీ తలవంచలేదు. ఎన్ని చేసినా జగన్‌ బాబును మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు.

వైఎస్‌కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా..
పరిటాల రవి హత్య జరిగినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నానాయాగీ చేసింది ఆరోజు. కన్నకొడుకని కూడా ఆలోచించకుండా రవి హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంస్కృతి రాజశేఖరరెడ్డిది. మరి మీరేం చేస్తున్నారు? ఎంక్వయిరీ వేయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు మాత్రం రోజుకొక ఫ్లెక్సీని సృష్టిస్తారు, పూటకో అబద్ధం చెబుతున్నారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్‌ అభిమానంటారు. ఆయన కుటుంబం వై?ఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులట. అదే వ్యక్తి జగన్‌ అభిమాని అయితే గత నాలుగు నెలలుగా విశాఖ విమానాశ్రయానికి జగన్‌ ప్రతి వారం వచ్చి వెళ్తున్నారు. అభిమానే అయితే ఇంతకాలం ఎందుకు జగన్‌ను కలవలేదు అతడు (నిందితుడు)? కలిసిన రోజే గొంతుకు కత్తి ఎందుకు పెట్టాడు? జగన్‌ అభిమానే అయితే కత్తి పెడతాడా? మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నా. నిజంగా అభిమానే అయినా, ఇంకొకరే అనుకున్నా.. ఎంక్వయిరీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు, ప్రభుత్వానికి లేదా?

నిష్పక్ష పాత విచారణ జరగాలి
ఇంకో విషయం అబద్ధపు లేఖ. ఆ లేఖను అప్పుడే ఎందుకు చూపించలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? పది గంటల తర్వాత ఎలా బయటకు వచ్చింది? అదేదో పాకెట్‌లో లెటర్‌ అంటున్నారు.. ఎందుకు మడతలు పడలేదు? ఇంకొకరెవరో ప్రశ్నిస్తే దానికి మరొకటి సృష్టించి మరో జవాబు. దాన్ని ఇద్దరో ముగ్గురో.. ఎవరెవరో రాశారని చెబుతున్నారు. ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రకటనలు, అబద్ధాలతోనే ఎందుకు జీవిస్తున్నారని అడుగుతున్నా. జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి నిష్పక్ష పాతమైన విచారణ జరగాలి. ఇదే విషయమై ప్రజలందరూ కూడా అడగాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఈ రోజుకే అసలు విషయం బయటకు వచ్చేది. జగన్‌ తిరిగి ప్రజల మధ్య ఉండేందుకు వెళుతున్నాడు. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ ఒక్కటి చెబుతుండేవారు. ఏ నాయకుడైనా మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపకూడదని. జగన్‌ కూడా అదే లక్షణం కలిగి ఉన్నాడు.

మరిన్ని వార్తలు