విజయమ్మ రక్తంలో తగ్గిన షుగర్ లెవెల్స్

21 Aug, 2013 18:29 IST|Sakshi
విజయమ్మ రక్తంలో తగ్గిన షుగర్ లెవెల్స్

ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు బుధవారం పరీక్షించారు. ఆమె రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గిందని వైద్యులు చెప్పారు. దీనివల్ల ద్రవాహారం తీసుకోవాల్సిందిగా వారు సూచించినా, ఆమరణ దీక్షలో ఉన్నందు వల్ల ఎలాంటి ద్రవాహారం తీసుకోడానికి తాను సిద్ధంగా లేనంటూ విజయమ్మ వారి విజ్ఞప్తిని తిరస్కరించారు.

వైఎస్ విజయమ్మ ఆరోగ్య పరిస్థితిని తాము పరీక్షించామని, ఆమె రక్తంలో చక్కెర స్థాయి తగ్గినందువల్ల ద్రవాహారం తీసుకోవాల్సిందిగా సూచించామని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చెందిన డాక్టర్ సునీత 'సాక్షి'కి తెలిపారు. అయితే, ద్రవాహారం తీసుకోడానికి కూడా విజయమ్మ నిరాకరించినట్లు ఆమె వెల్లడించారు.

సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయి 80-120 మధ్య ఉండాలి. మంగళవారం నాడు వైఎస్ విజయమ్మ రక్తంలో 90 వరకు ఉన్న చక్కెర స్థాయి బుధవారం నాడు ఒక్కసారిగా 74కు పడిపోయింది. దీంతో కనీసం సెలైన్ పెడతామని వైద్యులు చెప్పినా ఆమె నిరాకరించారు. రేపటికి ఏదైనా ద్రవాహారం ఇస్తేనే మంచిదని డాక్టర్ సునీత తెలిపారు. చక్కెర స్థాయి తగ్గినందువల్ల మూత్రపిండాలు, ఇతర అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటి నిర్ధారణకు మరి కొన్ని పరీక్షలు కూడా చేస్తామని వైద్యులు చెప్పినా అందుకు విజయమ్మ అంగీకరించలేదు.

మరిన్ని వార్తలు