ఆదినారాయణరెడ్డిని ఎందుకు విచారించరు?: సునీతా రెడ్డి

27 Mar, 2019 12:12 IST|Sakshi

నాన్న హత్యకేసు దర్యాప్తు తీరుపై అనుమానాలున్నాయి..  

మంత్రి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు రక్షిస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌ : తన తండ్రి హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉందని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమానాలు ఉన్నాయని, సరైన రీతిలో జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సునీతా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నాన్న చనిపోయి ఇన్నిరోజులు అయినా ...వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా...ఆ దిశలో విచారణ చేయడం లేదు. మనిషి పోయింది మాకే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తేకే సంబంధం ఉంటే...చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?. మా నాన్నను ఎవరు చంపారనే దానికి సమాధానం కావాలి. అంతేకాకుండా నాన్న హత్యను రాజకీయం చేస్తున్నారు.

మా నాన్న 70వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులు జమ్మలమడుగు కోసం ఖర్చు చేశారు.  జగనన్న సీఎంని చేయడానికి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గెలుపు కోసం నాన్న కృషి చేస్తున్నారు. కడపలో ఉన్న ప్రతి స్థానిక నేత మా నాన్నకు తెలుసు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా కుటుంబం గురించి అడిగిన ప్రతి చిన్న విషయాన్ని సిట్‌ అధికారులకు వివరించాను.

మా నాన్నది నలుగురికి సేవ చేసే తత్వం. ఆయన అలా చనిపోతారని నేను అనుకోలేదు. నాన్న చనిపోయిన విషయం సీఐ శంకరయ్యకు ఉదయం 6.40 గంటలకు తెలిపాం. ఈ కేసులో పరమేశ్వర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశామన్నారు. అయితే మార్చి 14వ తేదీ ఉదయం పరమేశ్వర్‌ రెడ్డి ఛాతీ నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరగానే వివేకానందరెడ్డి తనకు సన్నిహితుడని చెప్పారు. పరమేశ్వర్‌ రెడ్డి ఆ రోజంతా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. అదేరోజు సాయంత్రం ఆస్పత్రిలో గొడవ చేసి తనంతట తానే డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలను హరిత హోటల్‌లో పరమేశ్వర్‌ రెడ్డి కలిశారు. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. నాన్న హత్య జరిగినప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డికి...పరమేశ్వర్‌ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగాయి. ఇన్నిరోజులు అయినా ఆదినారాయణరెడ్డిని, పరమేశ్వర్‌ రెడ్డిని ఎందుకు విచారణ చేయడం లేదు.  ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మాకు అనుమానం కలుగుతోంది. ఆదినారాయణ సిట్‌ విచారణ సరిగా లేనందునే మేము హైకోర్టును ఆశ్రయించాం. ఈ కేసును సక్రమంగా విచారణ చేయాలి. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తెగా న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చాను.’ అని అన్నారు.  సునీతా రెడ్డి ఈ సందర్భంగా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, అనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు