అతను ఎందుకలా ప్రవర్తించాడు: సునీతారెడ్డి

24 Mar, 2019 17:55 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి పది రోజులు దాటినా ఒక్క క్లూ దొరకలేదని, విచారణ సరైన పద్ధతిలో నడుస్తుందో లేదో అని ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నారు.. అయినా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చింది.. ఆయనొక ఇన్‌స్పెక్టర్‌, ఆయనకు కేసు పెట్టాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అది హత్య అని సీన్‌లో లేని మాకు అనుమానం వస్తోంది. సీన్‌లో ఉన్న ఆయనకు మేము చెప్పాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏదన్నా కవర్ చేయాలని ప్రయత్నించాడా?. ఎందుకు అతను అలా ప్రవర్తించాడు?.

ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారు. కట్లు కూడా కట్టారు. సీఐకి తెలియదా అది తప్పు అని. పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏమి చేశారు. ఎందుకు అలా జరిగేలా చేశారు. అక్కడున్న మా ఫ్రెండ్స్, బంధువులకు షాక్‌లో ఏమీ అర్థం కాలేదు అనుకుందాం! మరి అన్నీ తెలిసిన సీఐ గారికి ఏమైంది?. ఆయనకు రూల్స్ బాగా తెలుసు కదా.. ఆయన కూడా ఈ క్రైమ్‌లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి. కానీ దీనికి జవాబు దొరకడం లేదు. అసలు విచారణలో ఏమి జరుగుతోంది. అధికారులను ఎవరైనా తప్పు దోవ పట్టిస్తున్నారా. దానికోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారా. త్వరలో నాకు సమాధానం దొరుకుతుందనుకుంటున్నా’’ అని అన్నారు.

చదవండి : నాన్న హత్యపై విష ప్రచారం

మరిన్ని వార్తలు