ఓటు గల్లంతుపై వైఎస్‌ వివేకానందరెడ్డి సీరియస్‌

4 Mar, 2019 10:47 IST|Sakshi

సాక్షి, పులివెందుల: తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి సీరియస్‌ అయ్యారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తెలియకుండా.. తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యుహరచన జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఓట్లు తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. తన ఓటు గల్లంతుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డికి ఓటు తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లను దొంగ సర్వేల ద్వారా గుర్తించి వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానందరెడ్డితోపాటు పులివెందుల నియోజకవర్గంలోని చాలా మంది వైఎస్సార్‌ సీపీ సానుభనూతిపరుల ఓట్ల తొలగింపుకు ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తులు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు