వైఎస్ ఆశయాలను ప్రచారం చేస్తాం

26 Nov, 2014 02:29 IST|Sakshi

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట), టూటౌన్ :దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల కోసం, పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, అనుసరించిన విధానాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన లంకపల్లి డేవిడ్, బాలిబోయిన నవహర్ష, కరాటం కృష్ణస్వరూప్‌లను పార్టీ విద్యార్థి విభాగంలో కీలక పదవుల్లో నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ముగ్గురు నాయకులు మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
 
 ఉద్యమ నాయకుడిగా.. పీహెచ్‌డీ స్కాలర్‌గా..
 వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన లంకపల్లి డేవిడ్ ఏలూరు నగరానికి చెందిన వారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఎంబీఏ పూర్తిచేసి రీసెర్చ్ స్కాలర్‌గా పీహెచ్‌డీ చేస్తున్న ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆందోళనా కార్యక్రమాలు చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి, యువజన, విశ్వవిద్యాలయాల జేఏసీ కన్వీనర్‌గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునెటైడ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా, బహువర్గ స్టూడెంట్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, మైనార్టీ స్టూడెంట్ సంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమించిన చరిత్ర ఆయనకు ఉంది.  తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, జిల్లా అధ్యక్షులు ఆళ్ల నానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
 
 విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర
 వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన బాలిబోయిన నవహర్ష ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన వారు. బీ.కాం కంప్యూటర్స్ చదివి ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు. 2009లో జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌గా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. నవహర్ష మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసగించినట్టుగానే విద్యార్థులను మోసగిస్తున్నారన్నారు.
 
 అధ్యక్షుని అడుగు జాడల్లో...
 వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కరాటం కృష్ణ స్వరూప్ బుట్టాయగూడెం గ్రామానికి చెందిన వారు. ఆయన మాట్లాడుతూ పార్టీ విద్యార్థి విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించడాన్ని పదవిలా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తానన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో పయనిస్తూ, ఆయన నిర్వహించే ఉద్యమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి కృషి చేస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు