మళ్లీ వైఎస్సార్‌ అభయహస్తం

24 Aug, 2019 09:29 IST|Sakshi

పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం

కొత్తవారిని  చేర్పించే బాధ్యత వలంటీర్లకు

క్షేత్ర స్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు

అర్హులైన వారికి రెండు పింఛన్లు

సాక్షి, మచిలీపట్నం : అభయహస్తం...ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల మాదిరిగా 60 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలు పింఛన్‌ పొందేందుకు ఉద్దేశించిన పథకం...మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేసిన ఈ పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించింది. వైఎస్సార్‌ అభయహస్తం పథకం పేరిట అర్హులైన వారిని సభ్యులుగా చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

జీవిత చరమాంకంలో నిరుపేద మహిళలకు ప్రతి నెలా ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మహానేత శ్రీకారం చుట్టిన అభయహస్తం పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ఇప్పటి వరకు 12 రకాల సామాజిక పింఛన్‌లు ఇస్తున్నారు. వీటికి అదనంగా అభయహస్తం పింఛన్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. స్వయం సహాయక సంఘ సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్‌ చెల్లించి  60 ఏళ్లు వయస్సు కల వారైతే ఈ పెన్షన్‌కు అర్హులుగా నిర్ధారించారు. అయితే వీరిలో ఎవరైనా వితంతు, వికలాంగ, ఒంటరి, వృద్ధాప్య పింఛన్‌  పొందుతుంటే దానికి అదనంగా ఈ అభయహస్తం పింఛన్‌  కూడా అందుకుంటారు. 

రూపాయి చెల్లిస్తే చాలు..
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 18–59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365లు చెల్లిస్తే అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పింఛన్‌  రూపంలో అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. 2009లో ప్రారంభించిన ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,25,872 మంది సభ్యులుగా చేరారు.  కృష్ణా జిల్లాలో 29,580మంది ప్రీమియం చెల్లించారు.వీరంతా రెండుమూడేళ్లు క్రమం తప్పకుండానే చెల్లించారు. ఈ పథకంలో చేరిన వారి కుటుంబాల్లో 8, 9, 10, ఇంటర్‌ చదివే పిల్లలకు ఏటా రూ.1200 స్కాలర్‌షిప్‌ కూడా పొందే వారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది మధ్యలోనే  ప్రీమియం చెల్లించడం మానే శారు. వారు చెల్లించిన ప్రీమియం మొత్తం కొంతమందికి వెనక్కి ఇచ్చారు. మరికొంత మందికి ఇవ్వకుండా దారిమళ్లించారు. కాగా 60 ఏళ్లు నిండడంతో 23,266 మందికి అభయహస్తం పెన్షన్‌ అందుకునే వారు.

అభయహస్తానికి టీడీపీ ప్రభుత్వం మంగళం
కాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని పూర్తిగా మంగళం పాడేసింది. కాగా అభయహస్తం పింఛన్‌ పొందుతున్న వారిలో 17వేల మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేయడంతో అభయహస్తం పింఛన్‌ ను రద్దు చేశారు. ప్రస్తుతం 5,300 మంది మాత్రమే అభయహస్తం పింఛన్‌ పొందుతున్నారు. వీరికి కూడా సామాజిక పింఛన్‌ మాదిరిగా రూ.2,250 చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో వైపు మహానేత శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని  పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 60ఏళ్లు దాటిన వారికి ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌  కింద రూ.2,250లు చెల్లిస్తున్నందున , ఈ స్కీమ్‌లో చేరే వారికి భవిష్యత్‌లో అంతకంటే ఎక్కువగానే పింఛన్‌ పొంద గలిగేలా ఈ పథకాన్ని డిజైన్‌ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కాబట్టి ఇందులో చేరే వారు వారి పేదరికం కారణంగా పొందే సామాజిక పింఛన్‌  ముడిపెట్టకూడదని నిర్ణయించింది. 
చనిపోతే రూ.30వేల నుంచి రూ.75వేలు 
ఈ స్కీమ్‌లో చేరే మహిళలు  చనిపోతే రూ.30 వేలు, ప్రమాదంలో చనిపోతే రూ.75వేలు, అంగవైకల్యానికి గురైతే రూ.75వేలు, పాక్షిక అంగ వైకల్యానికి గురైతే రూ.37,500 ఆమె కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. గతంలో మాదిరిగానే వారి కుటుంబాల్లో 8,9,10,ఇంటర్‌ చదువుకున్న పిల్లలుంటే ఏటా రూ.1200ల చొప్పున స్కాలర్‌షిప్‌లు కూడా మంజూరు చేయనున్నారు. అయితే ఈ పథకంలో సభ్యులుగా చేరాలంటే ప్రజాసాధికార సర్వేలో కచ్చితంగా నమోదై ఉండాలి. డ్వాక్రా సంఘ సభ్యురాలై ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చే బాధ్యతను గ్రామ, వార్డు వాలంటీర్లకు అప్పగించారు. వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లినప్పుడు అర్హులైన వారిని గుర్తించి  అభయహస్తం పథకంలో చేర్చించి, వారితో నెలకు రూపాయి చొప్పున ప్రీమియం కట్టిస్తారు.

రెండు పింఛన్లు వస్తాయి
అభయహస్తంలో చేరితే వారికి అభయహస్తం పింఛన్‌తో పాటు పేదరికం ప్రామాణికంగా వారికి వచ్చే సామాజిక పింఛన్‌ కూడా అందుతుంది. ఇందులో ఎవరూ సందేహ పడనవసరం లేదు. అర్హులైన వారిని చేర్పించే బాధ్యత గ్రామ, వార్డు వలంటీర్లదే..మహానేత శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ పునరుద్దరించి పగడ్బంధీగా అమలు చేసేలా చర్యలు చేపట్టారు. ఈ పథకాన్ని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
–పేర్ని నాని, రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు