చెరగని ముద్ర

2 Sep, 2018 11:34 IST|Sakshi

కడప గడపలో కృష్ణమ్మ గలగలలు

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్సార్‌

మెట్ట ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తే జన్మ ధన్యమని నాడే స్పష్టీకరణ

ప్రచార  ఆర్భాటాలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి కడప: ‘బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను...బంగారు పంటలే పండుతాయి. ముత్యాల మురిపాలు దొరలుతాయి’...ఇది శంకరంబాడి సుందరాచార్యులు రాసిన గేయం. ఇది ఒకనాటికి నిజమవుతుందని జిల్లా ప్రజలెవరూ ఊహించలేదు. మెట్ట ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తే నాజన్మ ధన్యమని రాజోలి రిజర్వాయర్‌ శంకుస్థాపన సందర్భంగా ఆనాడే స్పష్టీకరించారు వైఎస్‌ఆర్‌. ఆయన నిర్వహించిన జలయజ్ఞం ఫలితం సాకారమైంది. నీళ్లులేక నోళ్లు తెరచిన పులివెందుల నియోజకవర్గ బీడు భూములు పులకిస్తున్నాయి.  

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్‌...
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్‌ఆర్‌  ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు.   కేవలం ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో దాదాపు రూ.12వేల కోట్లు వెచ్చించారు. మొదటిదశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయసాగర్‌ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్‌ కాంప్లెక్స్‌ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. 

ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టిఆర్‌ఎస్, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆనాడు స్వయంగా ప్రకాశం బ్యారేజీపై నిరశన చేపట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూపించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచారని చరిత్రకారులు వివరిస్తున్నారు. 

జిఎన్‌ఎస్‌ఎస్‌ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో ఈ పధకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేయడం ద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతోపాటు, పిబిసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పాటు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పైడిపాళెం ప్రాజెక్టు అంచనా విలువ రూ.727కోట్లు కాగా,  వైఎస్‌  హయాంలోరూ.667కోట్లు వెచ్చించారు.

తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌లో అంతర్భాగంగా గతంలో పులివెందుల బ్రాంచ్‌కెనాల్‌ నిర్మించారు.టీబీ డ్యాంలో పూడికపేరుకపోవడం, ఎగువప్రాంతాల నీటి అక్రమ వినియోగం వంటి కారణాల వల్ల పిబిసీ ఏనాడు పూర్తి సామర్థ్యంతో సాగునీరు అందలేదు. రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో ఆయకట్టు స్థిరీకరణకోసం సిబిఆర్‌ను నిర్మించారు. అయినా ఆశించిన ఫలితం కన్పించలేదు. ఈనేపధ్యంలో సిబిఆర్‌కు గండికోట నుంచి 8.3టీఎంసీల నీటిని 5లిఫ్ట్‌లు ద్వారా తీసుకెళ్లే బృహత్తర పథకానికి కూడా వైఎస్‌  శ్రీకారం చుట్టారు. రూ.1343కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో రూ.1090కోట్లు   వైఎస్‌ హయాంలో ఖర్చు చేశారు. తదుపరి రోశయ్య, కిరణ్‌ సర్కార్‌లతోపాటు చంద్రబాబు సర్కార్‌తో కలిపి వెచ్చించిన మొత్తం కేవలం రూ.72కోట్లు అన్న వాస్తవిక విషయాన్ని గ్రహించాల్సి ఉంది.   వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్‌ పథకాలను పూర్తి చేయాల్సిన టీడీపీ సర్కార్‌ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని పలువురు వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు