నేడే రైతు పండుగ

8 Jul, 2019 03:59 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ప్రధాన కార్యక్రమం

హాజరు కానున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500

ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,000 కోట్లు

వడ్డీలేని రుణాలు.. విపత్తు సహాయ నిధి కింద రూ.2,000 కోట్లు

ఉచిత పంటల బీమా.. తదితర పథకాలకు సర్కారు శ్రీకారం

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో ప్రారంభమయ్యే రైతు దినోత్సవ కార్యక్రమాలు సాయంత్రం వరకూ కొనసాగుతాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం, పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యక్రమాన్ని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఆయన సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్‌ ఘాట్‌లో దివంగత మహానేత సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం గండి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటు మూడు ముఖ్యమైన పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం.   

సామాజిక పింఛన్ల పంపిణీకి శ్రీకారం  
అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా ఇప్పటికే ప్రకటించిన పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గం(కేబినెట్‌) ఆమోద ముద్ర వేసిన మిగతా పథకాలను సోమవారం రైతు దినోత్సవ సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాల పంపిణీ, ఉచిత పంటల బీమా, రబీ నుంచే అందించే పెట్టుబడి సాయం రూ.12,500 వంటి కీలక పథకాలకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’లో భాగంగా ప్రకటించిన వడ్డీ లేని రుణాల పథకం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చేలా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. ఇక ఉచిత పంటల బీమా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇందుకోసం రూ.2,163 కోట్లు కేటాయించారు. 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు కౌలు రైతులు మీ–సేవా కేంద్రానికి వెళ్లి, ఒక్క రూపాయి చెల్లించి పంట పేరు, చిరునామాను నమోదు చేయించుకోవాలి. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50,000 అందించే రైతు భరోసా పథకాన్ని, దురదృష్టవశాత్తూ రైతు దుర్మరణం పాలైనా, ఆత్మహత్యకు పాల్పడినా రూ.7 లక్షలు చెల్లించే పథకాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు దినోత్సవ సభలో లాంఛనంగా ప్రారంభిస్తారు. వీటితో పాటు సామాజిక పింఛన్ల పంపిణీని కూడా ఇదే సభలో ఆరంభిస్తారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు, శనగ రైతులకు మార్కెట్‌ వ్యత్యాస ధర చెల్లింపు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

17 మంది రైతులకు సన్మానం
రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన 17 మంది ఉత్తమ రైతులకు జమ్మలమడుగు సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానం జరుగనుంది. అలాగే సభా స్థలి సమీపంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ స్టాళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే పరికరాలను, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పంట రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసే అరటి పరిశోధన కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

రైతన్నలకు వైఎస్‌ జగన్‌ సందేశం  
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు లేఖ రూపంలో రాసిన సందేశాన్ని అధికారులు చదివి వినిపిస్తారు. శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, రైతులు, రైతు ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైతులను, శాస్త్రవేత్తలను సన్మానిస్తారు. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఇప్పటికే సంబంధిత జాయింట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం, మార్కెట్‌ యార్డుల్లో, మార్టేరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  

అన్నదాతలకు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం శుభాకాంక్షలు  
రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రి మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్న సీనియర్‌ రైతు దంపతులను గుర్తించి, సన్మానించాలని సూచించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎం.సుచరిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఖాదర్‌ వలీ తదితరులు పాల్గొంటారని ఆ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఉత్తమ రైతులను సన్మానించాలని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. (వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి సమగ్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు