ఆగస్టు 12న వైఎస్సార్‌ చేయూత

12 Jun, 2020 05:05 IST|Sakshi
గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం

దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం

ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం

‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు

గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారం కోసం రూ.1,863.11 కోట్లు

రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు

ఇక ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు

ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఐదేళ్లపాటు నివాసం ఉన్నాకే అమ్ముకునేలా నిబంధన

వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల విద్యుత్‌ కోసం 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటు

టీటీడీలో సన్నిధి గొల్లల కుటుంబీకులకు వారసత్వపు హక్కు.. వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఆగస్టు 12న ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరుల సమావేశంలో వివరించారు.

ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ తరాల కోసం.. 
► రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ తరాల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలు చేయనుంది. ప్రస్తుతం గర్భిణులు, చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారం కంటే మరింత శక్తివంతమైన పౌష్టికాహారం అందిస్తుంది.
► గిరిజన ప్రాంతం(ఏజెన్సీ)లో 77 మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల(మైదాన ప్రాంతం) వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు కానుంది. ఈ పథకం అమలుకు ఈ ఏడాది రూ.1,863.11 కోట్లు ఖర్చు చేయనుంది. 
► గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం 2018–19లో రూ.762 కోట్లను మాత్రమే ఖర్చు చేయగా, 2019–20లో ప్రస్తుత ప్రభుత్వం రూ.1,076 కోట్లను ఖర్చు చేసింది.

చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ 
► చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు, నెత్తిమీద బుట్ట పెట్టుకుని సరుకులు అమ్ముకుని జీవించే వాళ్లు.. కొండపల్లి, ఏటికొప్పొక కొయ్య బొమ్మలు, మచిలీప్నటం, శ్రీకాళహస్తి కలంకారి వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవనం సాగించేవాళ్లకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా సున్నా వడ్డీకి ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
► ఈ పథకాన్ని అక్టోబర్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా లబ్ధిపొందుతారని అంచనా. ఏడాదికి దాదాపు రూ.56 కోట్ల మేర వడ్డీని ప్రభుత్వం భరించనుంది.

ఇక తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి టీడీపీ సర్కార్‌ 2018–19 విద్యా సంవత్సరంలో బకాయిపడ్డ రూ.1,291 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3,780 కోట్లు విడుదల చేసింది.
► ఇకపై ఏడాదికి నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఒక్కో త్రైమాసికం పూర్తికాగానే ఆ మేరకు డబ్బు తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది.
► కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా.. 
► హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల పంపిణీకి జారీ చేసిన జీవోలో మార్పులు చేర్పులు చేయడానికి మంత్రివర్గం అంగీకరించింది.
► సర్కార్‌ ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుని.. 5 ఏళ్ల పాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునే వెసులుబాటును కల్పించింది.

గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ 
► విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్‌ శిక్షణా స్థలం కోసం 385 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు సాగు చేసుకుంటున్నారు. వారికి రూ.10.88 కోట్లను పరిహారంగా అందించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

బిల్డ్‌ ఏపీలో భాగంగా 11 స్థలాల అమ్మకానికి ఓకే 
► బిల్డ్‌ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాలæ (విశాఖపట్నంలో 7, గుంటూరులో 4) అమ్మకానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గుంటూరులో ఒక చోట, విశాఖలో మూడు ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ ద్వారా అభివృద్ధి చేసి, ఆ తర్వాత ఈ స్థలాలను ఈ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయం. 
► గుంటూరులో ఒక ప్రాంతంలో స్థలాన్ని అభివృద్ధి చేయడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ 
► విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. జేఎన్‌టీయూ–కాకినాడ నేతృత్వంలో నాలుగో కాలేజీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం. 
► ఇందులో 50 శాతం సీట్లను ఎస్టీ విద్యార్థులకు, మిగిలిన సీట్లను ఇతర వర్గాలకు కేటాయిస్తారు. ఈ కాలేజీ ఏర్పాటుకు రూ.153.85 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

రామాయపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆమోదం..
► రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రైట్స్‌ సంస్థ ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)కు ఆమోదం.  పేజ్‌–1 కింద 36 నెలల్లో రూ.3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక. పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన 802 ఎకరాల సేకరణకు రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

గండికోట, వెలిగొండ నిర్వాసితులకు పునరావాసం 
► గండికోట జలాశయంలో గరిష్ట స్థాయిలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఏడు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
► వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1,301.56 కోట్లు, తీగలేరు, ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ భూసేకరణకు రూ.110 కోట్లు మొత్తం రూ.1,411.56 కోట్ల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌.

పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం 
► రాష్ట్రంలో సేల్స్‌ ట్యాక్స్, సర్వీస్‌ ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
► ఆర్థిక శాఖ పరిధిలో ఈ విభాగం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు 55 పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తిరుమల సన్నిధి గొల్లలకు వారసత్వపు హక్కు
► తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో తిరుమల వేంకటేశ్వరుని ఆలయం తలుపులు తీసే సంప్రదాయాన్ని అనాదిగా సన్నిధి గొల్లలు కొనసాగిస్తున్నారు.  ఈ దృష్ట్యా వారి కుటుంబీకు లకు వారసత్వంగా వస్తున్న హక్కులను పరిరక్షించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం.

ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు ఓకే 
► కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్ల విండ్‌ పవర్, 1,200 మెగావాట్ల హైడ్రో, 1,000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని నాన్‌ కన్జమ్‌టివ్‌ పద్ధతిలో కేటాయించింది. 
► ఎన్నికలకు ముందు అంటే.. ఫిబ్రవరి, 2019లో గత ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. అప్పటి ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షల చొప్పున 4,700 ఎకరాల భూమిని గ్రీన్‌కో సంస్థకు కేటాయించింది. ఇప్పుడు అదే సంస్థకు.. అదే ప్రాజెక్టుకు ఎకరాకు రెట్టింపు ధర.. అంటే రూ.5 లక్షల చొప్పున భూమిని ఇచ్చేందుకు సర్కార్‌ అంగీకరించింది. 
► ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ చార్జ్‌ కింద రూ.లక్ష చెల్లింపునకు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షల చెల్లింపునకు ఆ సంస్థ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.32 కోట్ల అదనపు ఆదాయం సర్కార్‌కు వస్తుంది. ఈ ప్రాజెక్టు వందేళ్లు పని చేస్తుంది. అంటే.. సర్కార్‌కు అదనంగా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల్లో సర్కార్‌ అధీనంలోకి 500 ఎకరాలు 
► భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గత సర్కార్‌ జీఎమ్మార్‌కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు  2,200 ఎకరాల స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది.
► ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.3 కోట్ల ధర పలుకుతోంది. అంటే.. ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చింది. 
► ప్రభుత్వంలో అవినీతి లేకపోతే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టులే ఉదాహరణగా నిలిచాయని మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్, పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు.

మరిన్ని నిర్ణయాలు ఇలా..
► ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలో ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం. 
► గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌.
► ఏలూరు, ఒంగోలు, తిరుపతిలోని నర్సింగ్‌ కాలేజీల్లో 144 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అంగీకారం. ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగు పరచడంపై దృష్టి సారింపు.
► ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదముద్ర. ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో 55 పోస్టుల భర్తీకి ఆమోదం.

9 గంటల ఉచిత విద్యుత్‌కు దన్నుగా.. 
► రైతులకు పగటి పూటే తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం కోసం 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
► పోలవరం జల విద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్‌ టెండరింగ్‌లో రూ.405 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యేలా బిడ్‌ దాఖలు చేసిన మేఘా సంస్థకు ఈ కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్‌ మెమొరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ ఫైల్‌ చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా