పార్టీ పదవుల్లో సమతుల్యత

7 Sep, 2014 00:54 IST|Sakshi
పార్టీ పదవుల్లో సమతుల్యత

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీని పునర్‌వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల నేతలకు పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి ప్రకటించిన జాబితాలో జిల్లా నుంచి వివిధ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలకు పార్టీ అత్యున్నత స్థాయి పదవులు కట్టబెట్టారు. ఇంతవరకు పార్టీ సీఈసీ సభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు. మరో ముఖ్యనేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను పీఏసీ సభ్యుడిగా నియమించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావును పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమించారు.
 
 ఈ నియామకాల్లో ప్రాంతాలు, సామాజిక సమీకరణల్లో సమతుల్యత పాటించారు. జిల్లా పార్టీ పగ్గాలు మెట్ట ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి అప్పగించగా, కోనసీమకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. తాజా నియామకాల్లో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు పీఏసీ సభ్యుడిగా తీసుకోవడంతో ఆ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించినట్టయింది. సెంట్రల్ డెల్టా పరిధిలో బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్‌కు రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆ వర్గానికి పెద్దపీట వేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావును పార్టీ కేంద్రపాలక మండలిలోకి తీసుకోవడం ద్వారా కమ్మ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించారు.
 
 అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూకు ఇటు రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా తీసుకున్నారు. నీటి పారుదల సహా పలు అంశాలపై విశ్లేషణాత్మకమైన వివరణలతో నెహ్రూకు మంచి వాగ్ధాటి కలిగి ఉండడంతో.. అధికార ప్రతినిధిగా కూడా తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల నియామకాల్లో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజాకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తీసుకోవడం ద్వారా ఆ సామాజికవర్గ ప్రాతినిధ్యాన్ని పెంచినట్టయింది. ఈ రకంగా అటు కోనసీమ, ఇటు మెట్ట ప్రాంతంతో పాటు సెంట్రల్, ఈస్ట్రన్ డెల్టాలు, రాజమండ్రి ప్రాంతాలకు, సామాజికంగా అన్ని వర్గాల నేతలను తీసుకుని పదవుల పంపకాల్లో సమతుల్యత పాటించారు.
 

మరిన్ని వార్తలు