5న వైఎస్సార్ సీపీ మహాధర్నా

25 Nov, 2014 01:30 IST|Sakshi
5న వైఎస్సార్ సీపీ మహాధర్నా

బాపట్ల: వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి మోసం చేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపడుతున్న మహాధర్నాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. బాపట్లలోని కోన ఛాంబర్‌లో సోమ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఎమ్మెల్యే కోన రఘుపతి, పార్టీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తొలుత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థులు రుణమాఫీ అంటూ ఇంటింటి ప్రచారం చేసి గెలుపొందారన్నారు. రుణమాఫీపై తొలి సంతకం చేసిన  చంద్రబాబు ఆతరువాత మాటమార్చి వ్యవసా య రుణాలు కాదు, పంట రుణాలు అని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. కొంతమంది మంత్రులు రుణమాఫీ చేసినట్లే మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. రైతులు అప్పుల్లో మునిగివున్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పేవిధంగా వేలాదిగా రైతులు,మహిళలు తరలివచ్చి మహాధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు.

రాజధానిపై కూడా స్పష్టత లేదు
రాజధాని నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రికి స్పష్టతలేదని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు.  గుంటూరులో రాజధాని నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని అయితే రైతులు, రైతుకూలీలు, అనుబంధ వృత్తిదారులు జీవనభృతి కొల్పోవడంపై అన్నిపార్టీలు ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు మాత్రం వీరంతా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నారనే నెపం మోపే పనిలో ఉన్నారని అన్నారు. రాజధానికి వ్యతిరేకం కాదని, రైతుల భూములకు న్యాయం చేయాలని ఆయన మరో సారి స్పష్టం చేశారు.

ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది.. మేరుగ
జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. మహానేత డాక్టరు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైరు బళ్లు, ఎడ్లబళ్లతో ఇసుక తోలుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత టీడీపీ 97, 310 నంబర్ల పేరిట జీవోలు విడుదల చేసి ఆ పార్టీ నాయకులకు మాత్రమే వెలుసుబాటు కల్పించిందని మండిపడ్డారు.
మహా ధర్నా విజయవంతానికి కృషి  - ఎమ్మెల్యే కోన

 వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవటంపై ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ చేపడుతున్న మహాధర్నాకు బాపట్ల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నట్టు చెప్పారు.


 విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు భోగిరెడ్డి రమేష్‌రెడ్డి, మరుప్రోలు తిరుపతిరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు