సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు ప్రారంభం

2 Oct, 2013 11:31 IST|Sakshi

హైదరాబాద్ :  విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో  ఆయన పుట్టినరోజు నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది.

పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమైక్య పోరు దీక్ష ప్రారంభించాయి. సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం ఒకేసారి నిరహార దీక్షలు ప్రారంభం అయ్యాయి.  రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింతబలంగా వినిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకు దీక్షకు దిగారు.

విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలోపార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా,  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి , నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టారు. మంత్రాలయంలో  బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్సీపీ నేతలు దీక్షకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణదీక్షకు  దిగగా, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పోలవరంలో బాలరాజు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి... ఇలా 175 నియోజకవర్గాల్లో దీక్షలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు