‘నవ’ వసంతంలోకి..  వైఎస్‌ఆర్‌సీపీ

12 Mar, 2019 10:28 IST|Sakshi

నేడు వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం  సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన అధిష్టానం  

సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఆనాడు తెలుగు ప్రజ ల ఆత్మగౌరవం కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీ పెద్దలను ఎదురించి  పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలే ఊపిరిగా పోరాటాలు చేస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో  ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ  ప్రయాణంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. వైఎస్‌ఆర్‌ ఆశయాల సాధనే ధ్యేయంగా పార్టీ దూసుకెళ్తోంది.

2011 మార్చి 12న ఆవిర్భావించిన పార్టీ  నేటితో ఎనిమిదేళ్లు పూర్తి అయి తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో  సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఆదేశించింది. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.  

జిల్లాలో తిరుగులేని శక్తిగా వైఎస్‌ఆర్‌సీపీ.. 
కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది. 2012లో జరిగిన ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో  14 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 11 స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. రెండు పార్లమెంట్‌ స్థానాలు కూడా కైవసం చేసుకుంది. అంతేకాదు   స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తాచాటింది. 

నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ  
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ  ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తెలిపారు. భారీ కేకు కటింగ్‌తో పాటు జెండావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారు ఆదేశించారు.

క్లీన్‌స్వీపే లక్ష్యంగా.. 
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సందర్భంగా జిల్లాలో మరోసారి తన సత్తా  చాటేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధమవుతోంది.   జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుక ఇవ్వాలని పార్టీ నాయకులు ఉవ్విళ్లురుతున్నారు. అభ్యర్థి ఎవరైనా మట్టికరిపించాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. జిల్లాలో పార్టీకి వైఎస్‌ఆర్‌ అభిమానులు, బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.   అధికార  టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి నాయకులను లాక్కోవాలని చూసింది. అందులో భాగంగా గత ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై  గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిని, ఇద్దరు ఎంపీలను కొనుగోలు చేసింది.  అయినా, ఎక్కడా పార్టీ క్యా డర్‌ చేజారలేదు. వారంతా పార్టీ నవ వసంతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తుండడం విశేషం.  
 

మరిన్ని వార్తలు