నీరిచ్చే వరకూ పోరాటం

8 Dec, 2014 01:40 IST|Sakshi
నీరిచ్చే వరకూ పోరాటం

సంతమాగులూరు: సాగునీటి ఎద్దడిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అధికారుల అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు బాసటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వివిధ మండలాల రైతులు వందలాది మంది అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం బైఠాయించారు. మక్కెనవారిపాలెం వద్ద రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లాకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేసి సాగునీటి సమస్య తీర్చాలని రైతులు నినాదాలు చేశారు. రాస్తారోకో విరమించాలని ఎన్నెస్పీ సంతమాగులూరు డీఈఈ అప్పారావు, ఎస్సై ఎ.శివనాగరాజు కోరగా..ఎమ్మెల్యే తిరస్కరించారు. ఉన్నతాధికారులు వచ్చి రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ సంభాషణలతో సమస్యలకు పరిష్కారం లభించకనే..రైతులతో కలిసి తానూ రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.

ఆందోళన విరమించకపోవడంతో ఎస్సై ఎ.శివనాగరాజు ఎమ్మెల్యే రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసుల కదలికలు గమనించిన రైతులు రవికుమార్ చుట్టూ వలయంలా ఏర్పడి అడ్డుకున్నారు. రైతులు, నాయకులతో అర్ధగంటపాటు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు ఎమ్మెల్యే రవికుమార్ సహా 30 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై అందరినీ విడుదల చేశారు.  
 
ఎమ్మెల్యేతో మాట్లాడిన మంత్రి ఉమా:
ఎమ్మెల్యే రవికుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన తరువాత రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.  ఏబీసీ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రవికుమార్ మంత్రికి వివరించారు. వెంటనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సీఈ వీర్రాజును కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నమంత్రి ప్రకాశం జిల్లా రైతులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి బ్రాంచి కెనాల్‌కు 0/0 వద్ద 2400 క్యూసెక్కులకు నీటి  విడుదలను పెంచి ప్రకాశం జిల్లా (18/0)కు 1400 క్యూసెక్కులకు తగ్గకుండా అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నీటి విడుదలను తక్షణమే పెంచుతున్నామని, సోమవారం ఉదయానికి 18/0కు 1400 క్యూసెక్కులు అందిస్తామని తాను కూడా కాలువపై పర్యటించి పర్యవేక్షిస్తానని సీఈ వీర్రాజు రవికుమార్‌కు హామీ ఇచ్చారు.

సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళన బాటే..
కాలువకు పుష్కలంగా నీటిని విడుదల చేసి జిల్లా పరిధిలోని సాగర్ కాలువల ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో కాకమ్మ కబుర్లు చెప్పి నీటి సమస్య పరిష్కరించకుంటే ఆందోళను మరింత ఉధృతం చేసి కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసుల అరెస్ట్‌కు సహకరించామన్నారు. ఈ ఆందోళనలో ఎంపీపీ సన్నెబొయిన ఏడుకొండలు, సర్పంచ్‌ల సంఘ మండల అధ్యక్షుడు సంతమాగులూరు సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ  మాజీ సభ్యులు చింతారామారావు, కరిపరమేష్, సింగరయ్య, సంతమాగులూరు, బల్లికురవ, పంగులూరు, అద్దంకి మండలాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు