ఇక సమరమే

16 Feb, 2015 03:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో ఇక సమరం సాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం పార్టీ రాష్ర్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారితో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రసంగించారు. కొత్తగా నియమించిన 50 డివిజన్ల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... జిల్లా కార్యాలయం ఏది కోరినా ఇచ్చేందుకు కేంద్ర కార్యాలయం సిద్ధంగా ఉంటుందని అన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా అన్ని సంఘాలు సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
 
 డివిజన్ అధ్యక్షుడికి ఆ డివిజన్‌పై పూర్తి అవగాహన ఉండాలని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని, కోర్టులు, పోలీసు శాఖలను ఉపయోగించుకుని ప్రజా సమస్యలపై పోరాడమని ఉద్బోధించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తే ఆ బృందమే జీవీఎంసీ ఎన్నికలను ఎదుర్కొంటుందని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండేవాడే నిజమైన నాయకుడన్నారు.
 అమర్ మాట్లాడుతూ జిల్లా కార్యాలయానికి భవనాన్ని సమకూర్చిన పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజును అభినందించారు. ఢిల్లీలో ‘ఆప్’కు 67 సీట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి 167 సీట్లు వస్తాయన్నారు. చంద్రబాబు 300 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అనకాపల్లి ఎఎంఎల్ కళాశాల వద్ద రూరల్ పార్టీ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామ న్నారు. ఎమ్మెల్యే పాడేరు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి కార్యాలయం ప్రారంభంతో శ్రీకారం చుట్టామన్నారు. 2019లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
 
  మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రసంగిస్తూ అమర్‌నాథ్ వంటి నాయకుడిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆనాడు జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని అమర్ సార్ధకం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ వాగ్దానాలను పక్కనబెట్టి, జీవోలను సైతం విస్మరిస్తున్న టీడీపీ పాలనను ఎండగట్టాలన్నారు. అవవసరమైతే న్యాయస్థానాల్లో పోరాడాలన్నారు. రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ పార్టీకి ప్రతీ ఒక్కరూ సమయం కేటాయించాలని..విశాఖ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ పార్టీదే అధికారమని, అయితే దానిని సాధించే బాధ్యత ఎవరోఒకరిపై నెట్టేయ కూడదని రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
 
 నగరంలో ప్రజలకు ఎక్కడా ఏ పనీ జరగడం లేదని దానిని గుర్తించి వారి తరపున పోరాడాలని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సూచించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందామని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ మనదేనని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే జీవీఎంసీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, కేంద్రం ప్రకటించిన హుద్‌హుద్ సాయం రూ.1000 కోట్లు తెప్పించాలని డిమాండ్ చేశారు. చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జన్మభూమి కమిటీలను రాజ్యాంగానికి విరుద్ధంగా వేసారని, దీనిపై పార్టీ తరపున కోర్టుకు వెళ్లాలని సూచించారు.
 
 మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం మాట్లాడుతూ భవిష్యత్ వైఎస్సార్ సీపీదేనన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చి ప్రజా సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని పార్టీ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి ప్రారంభ ఉపన్యాసంలో అన్నారు. పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజు మాట్లాడుతూ పార్టీ తనకు ఇచ్చిన గుర్తింపు ముందు తాను చేసింది చాలా తక్కువన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. కార్యాలయం ఏర్పాటుతో జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త నాగేశ్వర రావు అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్  పిలుపు నిచ్చారు. జిల్లా అధ్యక్షుడికి అన్ని విధాలా సహకరిస్తామని మైనార్టీ సెల్ ఐదు జిల్లాల ప్రధాన కార్యదర్శి ఫరూక్ అన్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలను ప్రశ్నించడానికి పార్టీ కార్యాలయం ఒక వేదికని జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ అన్నారు. తూర్పు నియోజక వర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్‌ను సీఎం చేసే వరకు విశ్రమించవద్దని కార్యకర్తలకు సూచించారు.
 
  గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వాగ్దానాలు అమలు చేయలేని చంద్రబాబు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నారన్నారు. ద క్షిణ నియోజకవర్గ సమన్వయ కర్త కోలా గురువులు మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేసి బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా నాయకులు ఆల్ఫా కృష్ణ, సత్తి రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రాజు, మధుసూదనరావు, ఉమారాణి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు