శ్రామికుల సంక్షేమమే మేడే లక్ష్యం

2 May, 2019 04:54 IST|Sakshi
మే డే వేడుకల్లో మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి, చిత్రంలో ధర్మాన కృష్ణదాస్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు

ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా శ్రామిక జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా మే నెల ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) నిర్వహిస్తారని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం మే డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో కార్మికుల శ్రేయస్సు కోసం అనేక అంశాలు పొందుపరిచినట్లు వివరించారు. ప్రతి కార్మికుడికీ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నాయకులులు ధర్మాన కృష్ణదాసు, అంకంరెడ్డి నారాయణమూర్తి, డాక్టర్‌ ప్రపుల్లారెడ్డి, బి.సంజీవరావు, పాలెం రఘునాథ్‌రెడ్డి, నాగదేశి రవికుమార్, బి.శ్రీవర్దన్‌రెడ్డి, మాజిద్, కనుమూరి రవిచంద్రారెడ్డి, ఆర్‌.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

23 తర్వాత కార్మిక పక్షపాత సర్కార్‌: గౌతమ్‌రెడ్డి
రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ తర్వాత కార్మిక పక్షపాత ప్రభుత్వం ఏర్పాటవుతుందని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర  కార్యాలయంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌టీయూ జెండా ఆవిష్కరించి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాలనలో కార్మికుల పొట్టగొట్టే చర్యలు ఎన్నో చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ జెండా, అజెండాలో కార్మికుల సంక్షేమం ఉందని.. పార్టీ మేనిఫెస్టోలో మొదటిగా కార్మికుల సంక్షేమం గురించి పొందుపర్చినట్లు చెప్పారు.

విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసి కార్మిక ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ బందరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మాధు శివరామకృష్ణ, విజయవాడ పార్లమెంట్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ప్రదీప్, విజయవాడ నగర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు