విత్తన సమస్య పాపం బాబుదే!

31 Jul, 2019 04:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుతం విత్తనాల సమస్య తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అనాలోచిత విధానాలే కారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఖరీఫ్‌ ప్రణాళిక తయారీలో తీవ్ర అలసత్వంతో వ్యవహరించిందని దునుమాడారు. విత్తనాల సేకరణకు ఇవ్వాల్సిన నిధులను ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు కుంకుమ పథకానికి మళ్లించిందని ఆరోపించారు. ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్‌కు ఇవ్వాల్సిన రూ.380 కోట్ల బకాయిలను కూడా దారిమళ్లించిందన్నారు. శాసనసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, డాక్టర్‌ ఎం.తిప్పేస్వామి, జ్యోతుల చంటిబాబు, గొర్లె కిరణ్‌కుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి కన్నబాబు సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జూన్‌ 8 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న చంద్రబాబు ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక తయారీని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను సేకరించారన్నారు. కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో రైతులు 1176 రకం వరి వంగడాన్ని కోరుతున్నారన్నారు. తిప్పేస్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో మడకశిర ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు.  ఒక్క రూపాయికే 55 లక్షల మంది రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కింద 4, 5 విడతల పెండింగ్‌ బకాయిల కోసం మొత్తం రూ.7,925 కోట్లు కావాల్సి ఉందని, 19,20,542 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతుల తరఫున పంటల బీమా, వాణిజ్య పంటల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 

‘కోర్స్‌’ టెక్నాలజీతో భూముల రీ సర్వే: డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
కంటిన్యూయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ (సీఓఆర్‌ఎస్‌ – కోర్స్‌) అనే స్టేట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో రాష్ట్రంలో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. శానససభలో టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎంత కష్టమైనప్పటికీ రాష్ట్రంలోని మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాల్లో అటవీ భూములు మినహా మొత్తం భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అసైన్డ్‌ భూములను వేరేవాళ్లు దొంగ పట్టాలతో ఆక్రమించుకున్నారని, కబ్జా చేసి విక్రయాలు కూడా జరిపారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సభ దృష్టికి తెచ్చారు.

పట్టణ గృహనిర్మాణంలో అక్రమాలపై విచారణ: మంత్రి బొత్స
రాష్ట్రంలో గత ఐదేళ్లలో పట్టణ గృహనిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.1,366 ఖర్చుచేయగా మన రాష్ట్రంలో రూ.2,311 వెచ్చించారని, దోపిడీకి ఇది నిదర్శనమని చెప్పారు. 

గోదావరి–కృష్ణ అనుసంధానంపై నాలుగైదు మార్గాలను పరిశీలిస్తున్నాం: మంత్రి అనిల్‌
గోదావరి జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి తరలించే అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్చిస్తున్నారని, ఇందులో ఎటువంటి చీకటి ఒప్పందాలు లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. గోదావరి జలాల తరలింపుపై ప్రస్తుతం నాలుగైదు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారని, రాష్ట్ర హక్కులకు ఎటువంటి భంగం లేకుండా ఆర్థిక భారం తక్కువగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటామన్నారు. మంగళవారం శాసనమండలిలో గోదావరి జలాల తరలింపుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు.

మరిన్ని వార్తలు