చంద్రబాబు భజన కోసమే టీడీపీ జనరల్‌ మీటింగ్‌: ఎమ్మెల్యేలు

29 Apr, 2020 18:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ జనరల్‌ బాడీ తీర్మానాలు దిగజారుడు తీర్మానాలు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్‌, జోగి రమేష్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనరల్‌ బాడీ మీటింగ్‌లో టీడీపీ నేతలు దీక్షలు చేసినందుకు వారికి వారే అభినందనలు తెలుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.వారు చేసే దొంగ దీక్షలకు వారికి వారే అభినందించుకునే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాము రాసిన లేఖల వల్లే ప్రజలకు మేలు జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు భజన కోసమే టీడీపీ జనరల్‌ మీటింగ్‌ను ఆన్‌లైన్‌లో పెట్టారని విమర్శించారు. అధికారం పోయినా భజన చేయించుకోవాలనే యావ టీడీపీ నేతలకు, బాబు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. రిటైర్ఢ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పెన్షన్ చెల్లిస్తామని చెబితే తన లేఖ వల్లే ఇది జరిగిందని పచ్చి అబద్దాలు చెపుతున్నారని ధ్వజమెత్తారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని, గుజరాత్ నుంచి మత్స్యకారుల్ని ప్రభుత్వం తీసుకువస్తే దానితో చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని పేర్కొన్నారు. అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు బయటకు వస్తే వారివల్ల కూడా కరోనా వ్యాపించిందని, ప్రజలకు సాయం చేసిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల వల్లే కరోనా వైరస్‌ వ్యాపించిందని తప్పు పడుతున్నారని ధ్వజమెత్తారు. (బాబు భయపెడుతుంటే.. జగన్‌ భరోసా కల్పిస్తున్నారు)

హైదరాబాద్‌లో హెరిటేజ్ ఉద్యోగులకు కరోనా వ్యాపించడానికి కారణం ఎవరంటే చంద్రబాబు ఇంతవరకూ సమాధానం చెప్పలేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా కరోనాపై పోరాటానికి మద్దతు పలుకుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.. అన్న ఒక వాక్యం కూడా టీడీపీ జనరల్ బాడీ తీర్మానంలో లేదన్నారు. రాష్ట్ర ఆదాయంలో లోటు మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దమన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని, కంటికి కనిపించని వైరస్‌తో జరుగుతున్న యుద్ధంలో రాజకీయాలు పక్కన పెడదామన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు మండిపడ్డారు. అన్ని వర్గాల కోసం డిమాండ్ చేస్తున్నట్లు డ్రామా ఆడితే, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు