'చదివే ఓపిక కూడా లేదా'

10 Feb, 2014 11:09 IST|Sakshi
'చదివే ఓపిక కూడా లేదా'

హైదరాబాద్ : అసెంబ్లీలో ఆర్థికమంత్రి రాంనారాయణ రెడ్డి  ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంపశయ్య మీద ఉన్న ప్రభుత్వం మరోసారి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆపార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సామాన్యులను వంచించే బడ్జెట్ అని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే బడ్జెట్ కాదని ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కె.శ్రీనివాసులు అన్నారు.  ప్రజా విద్రోహక బడ్జెట్గా అభివర్ణించారు. ధనికుల బడ్జెట్ తప్ప, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

బడ్జెట్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ చదవకుండా తప్పించుకున్నారని...ఆర్థిక మంత్రి సిగ్గులేని మంత్రి అంటూ ధ్వజమెత్తారు. ఆర్థికమంత్రికి బడ్జెట్ కూడా చదవే ఓపిక కూడా లేకపోవటం దారుణమన్నారు. ప్రచార ఆర్భాటాలే తప్ప...సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలు...పేద విద్యార్థుల ప్రస్తావన లేకపోవటం దారుణమన్నారు.

ఇందిర జలప్రభ కింద లబ్ది దారులను వేధించారని... బంగారుతల్లి పథకం లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడ్డారు. రోజుకు రెండు గంటలు కూడా రైతులకు విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ఆర్ హయాంలోని ప్రాజెక్టులకు ఇప్పటి సీఎం ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు