అన్నదాతకు అండగా... పోరుబాట

5 Dec, 2014 00:51 IST|Sakshi
అన్నదాతకు అండగా... పోరుబాట

నేడు బందరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా
ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్
జిల్లావ్యాప్తంగా తరలిరానున్న నేతలు, శ్రేణులు
స్వచ్ఛందంగాహాజరయ్యేందుకు సిద్ధమవుతున్న రైతులు, మహిళలు

 
విజయవాడ : అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ గడిచిన ఆరు నెలలుగా రోజుకో ప్రకటన చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. దీంతో అన్నదాతలు, డ్వాక్రా మహిళల రుణాలపై వడ్డీలు  పెరిగి మరింత భారంగా మారింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్ని జిల్లాల్లో ధర్నాలు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయనున్నారు.

రైతులను విస్మరించారు...

జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు 9,137 కోట్ల పంట రుణాలు, 58 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.918 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇవన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. వాటిపైనే విస్తృత ప్రచారం చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానన్న హామీని తుంగలో తొక్కారు. కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అనంతరం రైతులకు ఇచ్చిన హామీ నుంచి బయటపడేందుకు అనేక రకాల నిబంధనలు విధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో గడచిన ఆరు నెలలుగా రుణమాఫీ జరగకపోగా అన్నదాతలకు బ్యాంకుల్లో అప్పు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆందోళనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం ధర్నాకు సిద్ధమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొలుసు పార్థసారథి నియోజకవర్గాల సమన్వయకర్తలతో, ముఖ్య నేతలతో, అనుబంధ విభాగాల నేతలతో చర్చించారు. దర్నాను పర్యవేక్షించడానికి పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లాకు మాజీ మంత్రి ఎం. వెంకట రమణను సమన్వయకర్తగా నియమించింది. ఈ క్రమంలో మోపిదేవి పార్టీ జిల్లా నేతలతో ధర్నా ఏర్పాట్లపై చర్చించారు. మరోపక్క రైతులు, డ్వాక్రా మహిళలు కూడా స్వచ్ఛందంగా ధర్నాకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు