పోరుబాటలోనే వైఎస్సార్ సీపీ

19 Oct, 2013 03:17 IST|Sakshi
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని శిబిరంలో శక్రవారం 20, 22 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలోని శిబిరంలో పెంటపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. వెలివెల గ్రామ సర్పంచ్ వీరవల్లి రమాదేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
 వీరికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ తదితరులు సంఘీబావం తెలిపారు. తణుకులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం 17వ రోజుకు చేరాయి. ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామస్తులు దీక్షలో పాల్గొన్నారు. వీరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చింతా రామచంద్రారెడ్డి, కార్యదర్శి కె.వెంకటేశ్వరావు తదితరులు సంఘీభావం తెలిపారు. 
 
 రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ డైరక్షన్‌లో నడుస్తున్నారని, సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుడు గ్రంధి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ భీమవరం ప్రకాశంచౌక్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉద్యమకారులకు మాయ మాటలు చెప్పి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
 
మరిన్ని వార్తలు