42 సమస్యలు చర్చించడానికి 13 రోజులా?

7 Mar, 2017 01:22 IST|Sakshi
42 సమస్యలు చర్చించడానికి 13 రోజులా?

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘మొత్తం 42 సమస్య లున్నాయి. ఈ సమస్యలు చర్చించేందుకు కనీసం నెలరోజుల సమయం పడుతుంది. అందుకే మరో పదిరోజులు సమయం ఇవ్వాల్సిందిగా పదేపదే కోరాం. అందుకు శాసనసభ వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు ఒప్పుకోలేదు. ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలుగానే భావించాల్సి ఉంటుంది’ అని పుంగనూరు, రాయచోటి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

సోమవారం బీఏసీ సమావేశం ముగిసిన తరువాత వారు వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. అనేక సమస్యలున్నాయి.. మాట్లాడాలని చెబితే మాకు ఇంతకంటే సమస్యలున్నాయని నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. 42 అంశాలపై చర్చించే ధైర్యం మీకుంటే సభను మరో 20 రోజులు పెంచి జరిపించాలి అని సూచించారు. ప్రభుత్వంలో అవినీతి ఉందనటానికి ఓటుకు కోట్లు కేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. తప్పులు చేయలేదనుకున్నప్పుడు కోర్టుకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.

మరిన్ని వార్తలు