ఆ ఘనత వైఎస్సార్‌దే..

15 Mar, 2014 03:11 IST|Sakshi
ఆ ఘనత వైఎస్సార్‌దే..

ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందు తన తల్లి అరుణ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. 

25 ఏళ్ల పాటు వారి కుటుంబ సభ్యులు పదవులు అనుభవించి, ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో... అవి ఏమిటో గుంటూరు ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బాలశౌరి విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో కూర్చునే ఉద్యోగాలు ఇప్పిస్తానని గల్లా హామీలు ఇస్తున్నారని, అంటే ఎవరి అన్నం వారు వండుకోవడం, ఎవరి బట్టలు వారు ఉతు క్కోవడం వంటి ఉద్యోగాలేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం ఇవే నేను మీకు ఇచ్చే ఉద్యోగాలని చెప్పి జయదేవ్ చంద్రగిరి వెళ్లిపోతారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  దివాళాకోరు రాజకీయాలను మానుకోవాలని బాలశౌరి హితవు పలికారు. ఆ పార్టీ నేతలు అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగితే  ఒక్క చోట కూడా గెలవలేక పోయారని చెప్పారు. చంద్రబాబు రాసిన రెండు లేఖల కారణంగానే పెద్దమ్మ సోనియాగాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌లు రాష్ట్ర విభజనకు నాంది పలికారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

 ఆ ఘనత వైఎస్సార్‌దే..

 రాష్ట్ర రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఆ మహా నేతను రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌లో చూసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరులో ఐటీ హాబ్ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు. దీనిపై  ఇప్పటికే జననేత జగన్‌తో పలుమార్లు చర్చించానని చెప్పారు.
 

కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం ప్రభుత్వం నియమించే క మిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకుని ఎన్ని పార్టీలు ఏర్పడినా సాధించగలింది ఏమీ లేదన్నారు.
 సీట్లతో సంబంధం లేదు...

 అసెంబ్లీ సీట్ల కేటాయింపులో తనకు ఎటువంటి సంబంధం లేదని బాలశౌరి స్పష్టం చేశారు. సీట్లు విషయంలో తాను ఎటువంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సర్వేల ఆధారంగా జిల్లాలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, రాతంశెట్టి సీతారామాంజనేయులు, థామస్ నాయుడులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు