సంక్షేమ ప్రదాతా.. సదా స్మరామి

3 Sep, 2018 12:13 IST|Sakshi
నరసాపురంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముదునూరి ప్రసాదరాజు

జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ వర్ధంతి ఉప్పొంగిన ప్రజాభిమానం

సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు  

రాజన్న సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలని ప్రజల ఆకాంక్ష

జోహార్‌ వైఎస్సార్‌ నినాదం మార్మోగింది. పేదల గుండెల్లో దాగిఉన్న అభిమానం ఉప్పెనలా ఎగసి పడింది. సంక్షేమ ప్రదాత, జనహృదయ విజేతకు ప్రతి గుండె జేజేలు పలికింది. రాజన్నా.. మళ్లీరావా అంటూ
నినదించింది. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతిని ప్రజలు జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు.  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి,ఏలూరు: పేదలు, బలహీనవర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ని ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుని  నివాళులర్పించారు. గ్రామగ్రామాన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు,ప్రజలు మహానేత వర్ధంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  భారీగా అన్నదాన, రక్తదాన  శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పేదలు, వృద్ధులు, మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు.

ఏలూరులో ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌  (నాని) ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి నిర్వహించారు. తొలుత ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌తో కలిసి ఆళ్లనాని క్షీరాభిషేకం చేశారు.  అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.

నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం స్టీమర్‌రోడ్డు జంక్షన్‌లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేదలకు పులిహోర పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. గర్భిణులకు చీరలు పంపిణీ చేశారు.

వైఎస్సార్‌ సీపీ తాడేపల్లిగూడెం సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌లో  వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుండుమోగుల సాంబయ్య, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కర్రి భాస్కరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కర్రి సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.  చిన్నాయగూడెం రూరల్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ ఆరేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిమ్మకాయల మార్కెట్‌ వద్ద రైతు భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

నిడదవోలు  శాంతినగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో  వైఎస్సార్‌ విగ్రహానికి  పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జి. శ్రీనివాసనాయుడు  పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వూరు ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో  సత్యసాయి నిత్యాన్నదాన పథకంలో అన్నసమారాధన నిర్వహించారు.

తణుకు నియోజకవర్గ కో–ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు నాయకత్వంలో వైఎస్‌ వర్ధంతి నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.  

పాలకొల్లు  సమన్వయకర్త గుణ్ణం నాగబాబు  స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌లో వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ యడ్ల తాతాజీ పాల్గొన్నారు.   

 ఆచంట సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్‌ వర్ధంతి నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించారు.
 ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో  సుమారు 2వేల మందికి అన్నదానం, 50 మంది వికలాంగులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు.  

పోలవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆ«ధ్వర్యంలో వైఎస్‌ వర్థంతి నిర్వహించారు. దుప్పట్లు పంపిణీ చేశారు.

చింతలపూడి సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు.  ధర్మాజీగూడెంలో వైఎస్సార్‌సీపీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని  కోటగిరి శ్రీధర్, ఎలీజా ప్రారంభించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తదానం చేశారు.

దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో  అన్నదానం, రక్తదానం చేశారు. పండ్లు పంపిణీ చేశారు.

ఉండి సమన్వయకర్త పీవీఎల్‌ నర్శింహరాజు ఆధ్వర్యంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.  గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అన్నదా నం చేశారు.  పేదలకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు.
 భీమవరం  సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

మరిన్ని వార్తలు