వైఎస్సార్‌ కారణజన్ముడు!

9 Jul, 2018 01:16 IST|Sakshi

దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించారు 

రాజకీయాల్లో రోల్‌మోడల్‌గా నిలిచారు 

మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయగలరో చేసి చూపించారు 

జగన్‌ కూడా రాజన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు 

ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 

సాక్షి ప్రతినిధి, కడప/విజయవాడ సిటీ/ : ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి కారణజన్ముడు. దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుని సన్నిధికి చేరుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో ఆయన రోల్‌మోడల్‌గా నిలిచారు. ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయగలరో చేసి చూపించిన వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డి’అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

ఈ సందర్భంగా దివంగత నేత సతీమణి వైఎస్‌ విజయమ్మ రచించిన ‘నేను కాను.. క్రీస్తే’అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్‌ ఘాట్‌లో వైఎస్‌ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పటికీ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. రాజకీయాల్లో రోల్‌మోడల్‌గా నిలిచారని, మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయాలో ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో చేసి చూపించారని కొనియాడారు. తండ్రిలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజలకు మంచి చేయాలని పాదయాత్ర చేస్తున్నారని ఆమె వివరించారు. తండ్రికి ఉన్న ఉద్దేశాలు ప్రతీదీ నెరవేర్చాలని జగన్‌ కోరుకుంటున్నారని ఆమె వివరించారు. 

సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజల మధ్యలో ఉండాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా రాజన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని వైఎస్‌ విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు. వైఎస్‌ను మంచి భర్తగా, మంచి రాజుగా, మంచి సీఎంగా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది హృదయాల్లో నిలిపినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు.  కాగా, ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా వివిధ జిల్లాల్లో  రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు