కరోనాను జయించిన పోలీసులు

15 Jul, 2020 10:23 IST|Sakshi
కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

కోవిడ్‌–19 నుంచి కోలుకున్న 22 మంది

పోషకాహారాల పంపిణీ మనోస్థైర్యంగా ఉండాలి

జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప అర్బన్‌ :  కరోనా నియంత్రణ నేపథ్యంలో పోలీసుశాఖ అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ క్రమంలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 22 మంది  ఈ మధ్య కాలంలో కోవిడ్‌–19 బారిన పడి విజయవంతంగా కోలుకున్నారని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు. మంగళవారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు యంత్రాంగంలో విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడి కోలుకున్న సిబ్బందిని పిలిపించారు. వారికి డ్రై ఫ్రూట్స్, ఇతర పోషకాహార కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగంలో లాక్‌డౌన్‌ వేళ  విధులు నిర్వర్తించిన కడప, ప్రొద్దుటూరు, ఇతర ప్రాంతాల పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు కోవిడ్‌ బారిన పడ్డారన్నారు. వారంతా ప్రస్తుతం కోలుకున్నారన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో నిబంధనలు పాటిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, మనోస్థైర్యంతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చినా వైద్యులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బందికి తమవంతు సహకారాన్ని అందిస్తున్నారన్నారు. కోవిడ్‌–19 జిల్లా, రాష్ట్ర ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు సంపూర్ణంగా అందిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

భయపడాల్సిన పని లేదు
కరోనా పాజిటివ్‌ వచ్చినా ఎవరూ భయపడాల్సిన పని లేదు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగానే మొదట ఆందోళన చెందానని, కానీ వైద్య సేవలు, సౌకర్యాలు పొందిన తర్వాత ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యంతో త్వరగా కోలుకున్నాను. – ఎల్‌.సంజీవరావు, స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్, కడప

ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నా
కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ డిపార్టుమెంటులో, కుటుంబ సభ్యులు ఎవరూ చిన్నచూపు చూడలేదు. ఆత్మస్థైర్యంతో ఎదుర్కొమని, భయపడవద్దని భుజం తట్టారు. అంతేగాక వైద్య సేవలు మెరుగ్గా అందించడంతో త్వరగా కోలుకున్నా.– బి.రాజారెడ్డి, కానిస్టేబుల్, ప్రొద్దుటూరు

ఎస్పీ కృషి మరువలేనిది
పాజిటివ్‌ వచ్చిన సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపడం, ఎప్పటికప్పుడు ఎస్పీ  వారితో వ్యక్తిగతంగా ఫోన్‌లోనూ మాట్లాడారు. ఎస్పీ కృషి మరువలేనిది. ప్రస్తుతం కోలుకున్న వారికి డ్రై ఫ్రూట్స్, పోషకాహార కిట్లను  అందజేయడం అభినందనీయం. – దూలం సురేష్, పోలీసు అధికారుల  సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు

మరిన్ని వార్తలు