కంటి పాపలకు వైఎస్సార్‌ వెలుగు

26 Sep, 2019 08:31 IST|Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

అక్టోబరు 10 నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు

జిల్లాలో 3,09,000 మంది విద్యార్థులకు లబ్ధి

సాక్షి, కొత్తవలస /శృంగవరపుకోట: పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ఉచిత నేత్ర చికిత్సలుపౌష్టికాహార లోపం.. ఒత్తిడితో కూడిన విద్య.. ఏదైనా కారణం కావచ్చు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల కాలంలో దృష్టి లోపాలతో బాధపడుతున్నారు. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ అందరికీ దృష్టిలోపాలు సవరించి అవసరమైన కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని’ అక్టోబర్‌ 10 తేదీ నుంచి 16 తేదీ వరకూ జిల్లాలో అమలు చేయనుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికగా భావించి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

జిల్లా జనాభాలో ఎలాంటి కంటి సమస్యలున్నా పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని రూపొందించారు. జిల్లాలోని సుమారు 3,504 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3,09,000 మంది విద్యార్థులకు మెదటి దశలో అక్టోబర్‌ 10 నుంచి 16 వరకూ ప్రాథమిక కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పీహెచ్‌సీ పరిధిలో శిక్షణ కూడా ఇచ్చారు.

ప్రాథమిక స్థాయిలో గుర్తింపు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ప్రాథమిక పరీక్షలు (స్క్రీనింగ్‌) నిర్వహించి దృష్టి లోపాలున్న వారిని గుర్తిస్తారు. అనంతరం పీహెచ్‌సీల్లో ఏఎన్‌ఎంలు దృష్టి లోపాలున్న విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రెండోదశలో ఆప్తాలమిస్టులు వచ్చి పాఠశాలల వారీగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేస్తారు. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ, ఏరియా, రోటరీ, లైన్స్‌క్లబ్‌ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేస్తారు.

ఇప్పటికే జిల్లా అంధత్వ నివారణ సంస్థ విద్యార్థుల జాబితా తయారు చేసినట్టు సమాచారం.రెండు డివిజన్లలో..జిల్లా అంధత్వ నివారణ సంస్థతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10 నుంచి 16 వరకూ రెండు డివిజన్లలో అమలు చేస్తారు. 2022 లోపు పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రెండోదశలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ ఎంపిక చేసిన పిల్లలకు కళ్లద్దాలు అందించడం లేదా కంటి శస్త్రచికిత్సలు చేస్తారు.

పక్కాగా అమలు 
జిల్లాలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం. ఇందుకోసం జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్స్‌ఫోర్సు కమిటీ పనిచేస్తుంది. ఆరు దశల్లో జిల్లాలో పూర్తిగా అంధత్వ నివారణ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలోని 23,40,000 మంది జనాభాలో మెదటి, రెండు దశల్లో పాఠశాల విద్యార్థులు, మూడోదశలో 20,31,000 పెద్దలకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకూ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతి 10 పీహెచ్‌సీలకు ప్రోగ్రాం అధికారుల్ని నియమిస్తున్నాం . – కె.విజయలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌ఓ  

కార్యాచరణ సిద్ధం 
వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కలెక్టర్‌ చైర్మన్‌గా డీఎంఅండ్‌హెచ్, నోడల్‌ అధికారి, డీసీహెచ్‌ఎస్, డీపీఎం, డీఈఓ కలిపి టాస్క్‌ఫోర్స్‌ కమిటీగా పనిచేస్తున్నారు. విధి విధానాలపై ఇప్పటికే మండలస్ధాయి పీహెచ్‌సీల్లో శిక్షణ నిర్వహించాం. జిల్లాలో పథకాన్ని అక్టోబర్‌ 10న ప్రారంభిస్తాం.
– డాక్టర్‌ కేఎన్‌ మూర్తి,  జిల్లా అంధత్వ నివారణాధికారి

ఉపాధ్యాయులు సహకరించాలి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కంటిచూపు ప్రసాదిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో చేయూతనిస్తే పాఠశాలల్లో ఇక దృష్టి లోపాలున్న విద్యార్థులు ఉండరు. అందువల్ల విద్య అభ్యసించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– తారకేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఆప్తాలమిక్‌ ఆఫీసర్ల సంఘం 

మరిన్ని వార్తలు