10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

29 Sep, 2019 05:15 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి. చిత్రంలో మంత్రి శంకరనారాయణ, కాపు రామచంద్రారెడ్డి, గోరంట్ల మాధవ్‌

కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వచ్చే నెల 10న అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఇంటి వద్దకే పాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని.. అక్టోబర్‌ 2 నుంచి ఈ వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు.

గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించిన వారందరికీ 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష పేపర్‌ లీకేజీ అంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రచురించిందని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా.. అక్టోబర్‌ 2న సచివాలయాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఇవ్వడంతోపాటు స్వచ్ఛాంధ్ర కింద మరో రూ.5 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణంతో పాటు అంగన్‌వాడీల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దేశమని మంత్రి శంకరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా