ఐటి హబ్కు ఆనాడే పునాది వేసిన వైఎస్

16 Jul, 2014 15:32 IST|Sakshi
గన్నవరం సమీపంలోని మేథ ఐటి పార్క్

ఆంధ్రప్రదేశ్లో ఐటి హబ్కు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడే పునాదివేశారు. ఐటీ అంటే మనకు హైదరాబాద్, బెంగళూరు నగరాలే గొర్తుకు వస్తాయి. కానీ మన రాష్ట్రంలో ఐటీని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలన్న సదాశయంతో వైఎస్‌ ముందడుగు వేశారు. సంక్షేమమే ఆశయంగా,  అభివృద్ధే లక్ష్యంగా కోస్తా ప్రాంతంలో ఐటీ విస్తరించాలని ఆయన అనుకున్నారు. ఆ క్రమంలోనే విజయవాడకు సమీపంలోని గన్నవరంను హైటెక్ సిటీగా అభివృద్ధి చేయాలని తలంచారు.  అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక హంగులతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేశారు.  ఆ మహానేత వేసిన అప్పటి అడుగు విభజన నేపథ్యంలో కృష్ణా జిల్లాకు వరంగా మారనుంది.

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో హైటెక్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మాట్లాడుతూ '' ఐటీ హబ్ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు. కోస్తా ప్రాంతానికీ ఐటీ పరిశ్రమలు రావాలి. ఆ ఉద్ధేశంతోనే ఇక్కడ ఐటీ టవర్స్ నిర్మిస్తున్నాం. దీనివల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తాం'' అని చెప్పారు. అన్న మాటలను ఆయన అక్షరాల చేసి చూపారు.  ఆయన చెప్పిన ప్రకారం 450 కోట్ల రూపాయల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో గన్నవరంలో ఈ భారీ ప్రాజెక్ట్ పురుడుపోసుకుంది. తొలి దశలో మొదటి టవర్‌ను 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మొదటి టవర్‌లో నాలుగు కంపెనీలు నడుస్తున్నాయి. ఐటీ చదువులు పూర్తిచేసుకున్న కోస్తా విద్యార్థులకు విజయవాడ హైటెక్‌సిటీ ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఆ మహానేత అకాల మరణం తరువాత విజయవాడ హైటెక్‌సిటీకి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. మొదటి టవర్‌లో సరిపడా కంపెనీలను ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత మిగిలిన టవర్ల నిర్మాణం గురించి ఆలోచించడం మానేసింది. దీంతో హైటెక్‌ సిటీ అభివృద్ధి కుంటు పడింది. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను అంటే 13 జిల్లాలను అభివృద్ది చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ మహానేత దూరదృష్టి ఇప్పుడు కృష్ణా జిల్లాకు మహర్ధశ పట్టించనుంది. హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు గన్నవరంలోని హైటెక్‌ సిటీ కాస్త ఊరటనిస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ ఐటీ టవర్స్‌పై దృష్టి పెట్టి కొత్త కంపెనీలు వచ్చేందుకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తుందని ఆశిద్ధాం.

మరిన్ని వార్తలు