మన్యంపై ‘రాజ’ముద్ర

21 Mar, 2019 11:01 IST|Sakshi

అడవిబిడ్డలకు అండగా నిలిచి ఆదుకున్న వైఎస్సార్‌

అటవీ హక్కుల చట్టం అమలుచేసి పంట భూములకు పట్టాలు

వలస వెళ్లకుండా గృహ నిర్మాణాలు చేపట్టిన మహానేత

సాక్షి, యర్రగొండపాలెం/పుల్లలచెరువు: అభివృద్ధి అనే మాట అక్కడ ఓ బ్రహ్మపదార్థం! పూరిపాకల్లో నివాసముంటూ బిక్కుబిక్కుమని బతకడమే వారికి తెలుసు. కానీ వారి జీవితాల్లో మార్పు తెచ్చారు దివంగత సీఎం వైఎస్సార్‌. అడవినే నమ్ముకుని దుర్లభమైన బతుకులు వెళ్లదీస్తున్న గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించి.. గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2009లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి బంగారం పండించే భూములపై గిరిజనులకు హక్కు కల్పించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చారు. శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని 5 జిల్లాల్లో నివసిస్తున్న 2,360 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 7381 ఎకరాల భూములకు పట్టాలు అందజేశారు.

ప్రకాశం జిల్లాలో 1,138 మందికి 4428 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 348 మందికి 1034 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 149 మందికి 319 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 63 మందికి 75ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 662 మందికి 1,529 ఎకరాల చొప్పున స్వయంగా వైఎస్సార్‌ పట్టాలు పంపిణీ చేశారు. పక్కా గృహాలు, రోడ్లు మంజూరు చేశారు. గిరిపుత్రులు ఆ భూముల్లో బంగారు పంటలు పండిస్తూ వారి జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో వెలుగును నింపిన వైఎస్సార్‌ను తాము ఎన్నటికీ మరువలేమని నల్లమల అడవుల్లో జీవిస్తున్న గిరిజనులు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమను విస్మరించాయని, గిరిజనుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో తమకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు విమర్శిస్తున్నారు.

చంద్రబాబు పాలనలో ఇబ్బందులు
వైఎస్సార్‌ అటవీ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకుంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పట్టాకు కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదని, ప్రభుత్వం రైతులకు అందిచే సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు తమ చెంతకు చేరడం లేదని, ఇదేమిటని ప్రశ్నిస్తే అటవీ భూములకు ప్రభుత్వ రాయితీలు వర్తించబని అధికారులు బదులిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల్లో బోరుబావులు తవ్వించుకునేందుకు కూడా అటవీశాఖాధికారులు అభ్యంతరం చెబుతున్నారని వారు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందజేస్తారన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు.

రాజన్నను ఎట్టా మరిసిపోతాం


తన ఇంట్లో వైఎస్సార్‌ చిత్రపటంతో అభిమాని

వైఎస్సార్‌ హయాంలో ఎంతో లబ్ధిపొందిన గిరిజనులు నేటికీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాజన్న సేవలకు గుర్తుగా గారపెంట లాంటి గిరిజనగూడేల్లోని ఇళ్లలో వైఎస్సార్‌ చిత్రపటం కనిపిస్తుంది. గిరిజనగూడేల్లో మౌలిక వసతులు సమకూరింది వైఎస్సార్‌ హయాంలోనే కావడం గమనార్హం. కారు చీకట్లో నివసించే గిరిజనులు మొట్టమొదటిసారిగా వైఎస్సాఆర్‌ పాలనలో విద్యుత్‌ కాంతులను చూశారు. గిరిజన గూడేల్లో సీసీ రోడ్లు వేయించి, అటవీ ఉత్పత్తులపైనా హక్కులు కల్పించారు. ఏడాది పొడువునా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి కూలీల కుటుంబాల్లో సంతోషం నింపారు. దీంతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. పదో తరగతి పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థులు ఫీజు రీయింబెర్స్‌మెంట్‌ పథకం ద్వారా కార్పొరేట్‌ కళాశాలలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. నేడు వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటూ దివంగత నేతను స్మరించుకుంటున్నారు.

దుర్లభమైన జీవితాలను అనుభవించేవాళ్లం
మా తాతముత్తాతల కాలం నుంచి అడవులను నమ్ముకుని బతుకుతున్నాం. కట్టెలు కొట్టుకుని టౌనుకు తీసుకెళ్లి అమ్ముకుంటాం. భూముల్లో పంటలు వేసుకుంటే అటవీశాఖాధికారులు నాశనం చేసేవారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు.  మా బాధలు గుర్తించిన వైఎస్సార్‌ అటవీ హక్కుల చట్టం తేవడంతో స్వేచ్ఛగా పోలాలు సాగు చేసుకుంటున్నాం.
– పాత్లావత్‌ పెద్దమంత్రూనాయక్, రైతు

పంట రుణాలు ఇవ్వడం లేదు
అడవుల్లో జీవించే తమకు వైఎస్సార్‌ భూమి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో తాము మంచి పంటలు పండించగలుగుతున్నాం. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన భూములకు రుణాలు ఇచ్చేవిధంగా చూడాలి.    
– యర్రబాలనాయక్, రైతు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకపోతే చదువు లేదు 
నేను బీఎస్సీ బీఈడీ చేశా. ఆనాడు ఫీజురీయింబర్స్‌మెంట్‌ లేకపోతే నేను కేవలం డిగ్రీతో చదువు ఆపేసి ఉండేవాణ్ని. కానీ వైఎస్సార్‌ చలవతో బీఈడీ సీటు ఉచితంగా దక్కింది. ఫీజు కట్టకుండానే చదువు పూర్తి చేశా. నా లాంటి వారు ఎందరో ఉచితంగా చదువుకుంటున్నారు.
– బొజ్జా శ్రీనివాసరావు, గారపెంట

గిరిజన పంచాయతీలు ఎక్కడ?
గిరిజనుల అభివృద్ధికి పాటుపడతామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీకూడా నెరవేర్చలేదు. తిరిగి గిరిజనులను మరింతగా మభ్యపెట్టేందుకు జరగబోయో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి 5 వందలు జనాభా ఉన్న ప్రతి గూడేన్నిను ప్రత్యేక పంచాయతీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు ఎటువంటి చట్టం చేయలేదు. టీడీపీ పెద్దలు చెప్పే మాటలను గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు.
– పాత్లావత్‌ రాములు నాయక్, ఎంపీటీసీ సభ్యుడు, చెర్లోతండా

మరిన్ని వార్తలు