సీఎం జగన్ పేదల పక్షపాతి

21 Dec, 2019 13:28 IST|Sakshi

సాక్షి, ధర్మవరం: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24000 ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ధర్మవరం పట్టు చీరలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు.


దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో చేనేతలకు మేలు జరిగిందని, ఆయన బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌ పయనిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం అద్భుత పథకమని కొనియాడారు. చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నేతన్నల కష్టాలను స్వయం‍గా చూసిన వైఎస్ జగన్ గతంలో మూడు రోజులు నిరాహారదీక్ష చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగజారుతున్న రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తున్నారని, ఎన్నికల హామీలను నిక్కచ్చిగా అమలు చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు