స్కూలు అమ్మలకు ఆసరా 

2 Jun, 2019 08:38 IST|Sakshi

సాక్షి కడప/ ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అవ్వతాతల కోసం వైఎస్సార్‌ పింఛన్‌ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌...కిడ్నీ బాధితులకు పింఛన్‌ కింద రూ. 10 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేలు అందించేలా తొలి సంతకాన్ని చేసి దివంగత సీఎం వైఎస్సార్‌ను తలపించారు.  ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా శాఖలపై సమీక్ష చేస్తూ ప్రతి పథకాన్ని పేదలకు అందేలా రూపకల్పన చేస్తున్నారు.

మొదటగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి అందించే మహిళా కార్మికుల కష్టాలను అధ్యయనం చేసిన సీఎం వారి గౌరవ వేతనం పెంపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.1000 మాత్రమే...అందునా అది కూడా టీడీపీ సర్కార్‌ హయాంలో నెలనెల ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ కూడా మూడు, నాలుగు నెలల గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో పెట్టి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 1000 నుంచి రూ. 3000లకు గౌరవ వేతనాన్ని పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

జిల్లాలో 5745 మందికి లబ్ది
జిల్లాలో 3654 పాఠశాలల్లో సుమారు 2,17,536 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వంట ఏజెన్సీల ద్వారా 5745 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సీఎం తీసుకున్న నిర్ణయంతో గౌరవ వేతనం నెలకు  రూ.3 వేలు చొప్పున అందనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు వంట వండే సమయంలో అనేక అవస్థలకు గురవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఒకపక్క సమస్యలు...మరోవైపు సక్రమంగా రాని గౌరవ వేతనం.....అదికూడా అంతంత మాత్రంగా ఇస్తుండడంతో అవస్థలు పడుతున్న వారి కష్టానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇవ్వనుంది.జిల్లాలో 5745 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుండడంతో మహిళా కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరజిల్లుతున్నాయి.

వైఎస్సార్‌ అక్షయపాత్రగా నామకరణం
ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మొదటగా మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్సార్‌ అక్షయపాత్రగా నామకరణం చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రతి పాఠశాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పథకానికి నామకరణం చేసిన ఆయన పిల్లల కడుపుకు అందించే ఆహార విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాద్యతగా వ్యవహారించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మహిళా కార్మికుల్లో సంబరాలు
మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్కువ గౌరవ వేతనమే కాకుండా వారికి నెలనెల కూడా సక్రమంగా ఇవ్వలేదు. గౌరవ వేతనం పెంచుతామని హామి ఇచ్చినా దాన్ని అమలు చేయలేదు.  వరత్నాలతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని మేనిఫెస్టోలో లేకపోయినా....ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వస్తూనే సీఎం వైఎస్‌ జగన్‌ వారికి న్యాయం చేశారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహిళా కార్మికులు సంబరాలు చేసుకుంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు